Vajpayee Birth Centenary Tributes :భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ శత జయంతి సందర్భంగా ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిల్లీలోని 'సదైవ్ అటల్'ను బుధవారం ఉదయం సందర్శించారు.
పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు
ఈ క్రమంలో పూలమాలలు వేసి వాజ్‌పేయీకి నివాళులర్పించారు. వాజ్‌పేయీ స్మారకార్థం ఏర్పాటు చేసిన ప్రార్థనా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో వాజ్‌పేయీ సేవలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత వాజ్‌పేయీకి ఆయన దత్తపుత్రిక నమితా కౌల్ భట్టాచార్య సైతం నివాళులర్పించారు.
'దేశ నిర్మాణం కోసం జీవితాన్ని అంకితం చేశారు'
"మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ 100వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. బలమైన, స్వావలంబన, సంపన్నమైన దేశాన్ని నిర్మించడానికి వాజ్ పేయీ తన జీవితాన్ని అంకితం చేశారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఆయన దార్శనికత, లక్ష్యం కొనసాగుతుంది. గౌరవనీయులైన అటల్ బిహారీ వాజ్‌పేయీ రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ దేశానికి కొత్త దిశను, వేగాన్ని అందించారు. ఆయన సహవాసం, ఆశీస్సులు నాకు లభించడం నా అదృష్టం" అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు.
'భారత జాతి గర్వించదగిన నేత వాజ్‌పేయీ'
మాజీ ప్రధాని వాజ్‌పేయీ దూరదృష్టి వల్లే భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. వాజ్‌పేయీ శత జయంతి సందర్భంగా ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. 'భారతజాతి గర్వించదగిన నేత వాజ్‌పేయీ. ఆయన దూరదృష్టి వల్లే ప్రస్తుతం మన దేశం ప్రపంచదేశాలతో పోటీ పడుతోంది. దేశం గురించి వాజ్‌పేయీ ఆలోచించే తీరు విలక్షణమైనది. సంస్కరణల ప్రతిపాదనలపై వాజ్‌పేయీ స్పందించిన తీరు ఎన్నటికీ మరచిపోలేను. ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నాను' అని ఎక్స్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోస్ట్ చేశారు.
'ఆయన జీవితం దేశానికే అంకితం'
మాజీ ప్రధాని వాజ్‌పేయీ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. వాజ్ పేయీ రాజకీయాలలో గొప్ప ఆలోచనాపరుడని, ఆయన జీవితాన్ని దేశ ప్రతిష్ఠకు, సేవకు, అభివృద్ధికి అంకితం చేశారని కొనియాడారు. ఆయనతో కలిసి చాలా కాలం పని చేసే అవకాశం కూడా వచ్చిందని పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో వాజ్‌పేయీ కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
'ఆయన అడుగుజాడల్లోనే '
దేశానికి అటల్ బిహారీ వాజ్ పేయీ లాంటి నాయకుడు దొరకడం గర్వించదగ్గ విషయమని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. వాజ్‌పేయీ అడుగుజాడల్లో నడుస్తామని పేర్కొన్నారు.
వాజ్‌పేయీ సంఘ సంస్కర్త, సాహిత్యవేత్త కూడా!
అటల్ బిహరీ వాజ్‌పేయీ రాజకీయ వేత్త మాత్రమే కాదు దేశభక్తుడు, సాహిత్యవేత్త, సంఘ సంస్కర్త కూడా అని కొనియాడారు కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ. ప్రస్తుత కాలంలోని రాజకీయ నాయకులు వాజ్‌పేయీ అడుగుజాడలను అనుసరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన చేసిన పనులన్ని ప్రస్తుత ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేస్తున్నాయని కేంద్ర మంత్రి, అప్నాదళ్ నేత అనుప్రియా పటేల్ వ్యాఖ్యానించారు.