Indiramma Atmiya Bharosa Scheme : భూమిలేని నిరుపేద కూలీల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సుమారుగా 10 లక్షల మంది అర్హులు ఉంటారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ప్రాథమికంగా అంచనా వేశాయి. భూమిలేని వ్యవసాయ కూలీలకు ప్రతి ఏటా రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది.
ఏటా రూ. 1200 కోట్ల అదనపు భారం : దీనికి అనుగుణంగా కసరత్తు చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, రాష్ట్రంలో 29 లక్షల మంది కూలీలకు వ్యవసాయ భూమి లేదని తేల్చింది. ఏడాదిలో కనీసంగా 20 రోజులైన ఉపాధి హామీ పనులు చేసిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దాని ప్రకారం ఉపాధి హామీ పథకంలో 2023-24 ఆర్థిక సంవత్సరం ఏడాదిలో దాదాపుగా 10 లక్షల మంది కూలీలు 20 రోజుల పాటు పనిచేసినట్లు వెల్లడైంది. ఆ లెక్కన లబ్ధిదారులకు ఆర్థిక సాయం పంపిణీ చేయడానికి ఏటా రూ.1200 కోట్ల మేరకు అవసరమవుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అంచనా వేస్తోంది.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆర్థిక సాయం పథకం అర్హుల నిబంధనలు
- ధరణి పొర్టల్‌లో తమ పేరుపై భూమి లేని వారు.
- ఉపాధి హామీ జాబ్‌కార్టు, బ్యాంక్ అకౌంట్ ఉండాలి.
- బ్యాంకు పాస్‌బుక్‌లకు ఆధార్ కార్డు లింక్ తప్పనిసరిగా ఉండాలి.
- 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులు పనిచేసి ఉండాలి.
- గ్రామపంచాయతీ తీర్మానంలో అభ్యంతరాలు ఉండకూడదు.
పైన షరతులన్నింటికి అర్హులైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రెండు దశలలో రూ.12 వేల ఆర్థిక సాయం పొందుతారు. తెలంగాణలోని ప్రతి గ్రామ పంచాయతీలో జనవరి 21 నుండి 24వ తేదీ వరకు గ్రామసభ నిర్వహిస్తారు. అందులో లబ్ధిదారుల ముసాయిదా జాబితాను చదివి వినిపిస్తారు. అనంతరం అర్హుల తుది జాబితాను ఆమోదించడం జరుగుతుంది. ఒకవేళ గ్రామ సభలో ఎవరైనా, ఏవైనా అభ్యంతరాలు ఎదుర్కుంటే, సంబంధిత ఎంపీడీఓ వాటిని పరిశీలన చేసి, నిర్ణీత గడువు లోపు సమస్యను పూర్తిగా తెలుసుకుని పరిష్కరిస్తారు.
‘అనుసంధానం’ కాని వారిలో గుబులు : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆర్థిక సాయం పథకం కింద నగదు పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆధార్, జాబ్ కార్డులు, బ్యాంకు పాస్‌పుస్తకాలు అనుసంధానం కాని, వాటిలో తప్పులుదొర్లిన ‘ఉపాధి’ కూలీలు కొంత ఆందోళన చెందుతున్నారు. ఈ తప్పులను ఈ నెల 25వ తేదీలోపు సవరించాలని పంచాయతీరాజ్ శాఖ, ఆయా జిల్లాల్లోని అధికారులను ఆదేశించింది.
మొత్తం 6,92,921 మంది ఆధార్‌కార్డులలో తప్పులు ఉండగా, ఆదివారం (జనవరి 12) వరకు 4,99,495 మంది సంబంధించిన కార్డులను సవరించారు. జాబ్ కార్డులు, బ్యాంకు పాస్‌పుస్తకాల్లో నమోదైన తప్పులను కూడా సవరిస్తున్నారు. అధికారులు నిర్ణీత గడువులోగా తప్పులను సవరిస్తారా? ఆధార్ లింక్ పూర్తవుతుందా? తమకు రూ.12 వేల సాయం అందుతుందా? అని నిరుపేద కూలీలు ఆందోళన చెందుతున్నారు.
రైతులకు గుడ్ న్యూస్ - రైతు భరోసా మార్గదర్శకాలు జారీ - ఆరోజే డబ్బులు పంపిణీ
ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ