Celebrity Cricket League 2025 : ఈగ సినిమా విలన్, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కోసం ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఈ మేరకు తన టీమ్‌తో కలిసి బుధవారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంకు మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు, మెట్రో సిబ్బంది ఆయనతో ఫొటోలు దిగారు. సామాన్యులతో కలిసి ఆయన మెట్రోలో ఇలా సాధారణంగా ప్రయాణించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు 11 సీజన్లుగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరుగుతూ వస్తుంది. కర్ణాటక బుల్డోజర్స్ టీమ్‌కు కిచ్చా సుదీప్ కెప్టెన్‌గా ఉన్నారు. ఫిబ్రవరి 14వ తేదీన ఉప్పల్ స్టేడియంలో కర్ణాటక టీమ్ చెన్నై రైనోస్‌తో తలపడనుంది. ఫిబ్రవరి 15న తెలుగు వారియర్స్, చెన్నై రైనోస్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
సీసీఎల్‌కు భారీ భద్రత ఏర్పాటు : సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఈ నెల 14,15 తేదీల్లో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్‌లు ఉన్నాయి. సీసీ సుధీర్‌బాబు సీసీఎల్, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ శాఖ, క్రికెట్ స్టేడియం నిర్వాహకులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. సీసీఎల్ మ్యాచ్‌లకు ఎలాంటి విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. మ్యాచ్ సందర్భంగా ప్రతి ఒక్కరి కదలికలపై నిఘా ఉంచుతామని, వాహనాల పార్కింగ్ విషయంలోనూ ఏర్పాట్లు చేయాలని అన్నారు.
గత మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ ఓటమి : ఫిబ్రవరి 8వ తేదీన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక బుల్డోజర్స్ వర్సెస్ తెలుగు వారియర్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ 46 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ కెప్టెన్ అక్కినేని అఖిల్ మొదటి ఇన్నింగ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడగా, రెండో ఇన్నింగ్‌లో తేలిపోయాడు. రెండో ఇన్నింగ్‌లో టీమ్ మొత్తం బ్యాటింగ్, బౌలింగ్‌లో ఘోరంగా విఫలమైంది.
అదరగొట్టిన అఖిల్.. CCL 2023 విజేతగా తెలుగు వారియర్స్.. నాలుగోసారి టైటిల్ కైవసం