Liquor Ban In Holy Towns In MP :మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రధాన పుణ్యక్షేత్రాలున్న 17 పట్టణాల్లో మద్యం దుకాణాలను మూసివేస్తామని సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. శుక్రవారం ఖర్గోన్లో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మద్యం దుకాణాలను మూసివేయనున్న 17 పట్టణాల్లో ఒక మున్సిపల్ కార్పొరేషన్, ఆరు నగర పాలికలు, ఆరు నగర పరిషత్‌లు, ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించేందుకు తాము చేసిన సంకల్పం దిశగా ఈ నిర్ణయాన్ని తొలి అడుగుగా సీఎం మోహన్ యాదవ్ అభివర్ణించారు.
"ప్రధాన పుణ్య క్షేత్రాలున్న 17 పట్టణాల్లో ప్రస్తుతమున్న మద్యం దుకాణాలను పూర్తిగా మూసేస్తాం. వాటిని ఇతర ప్రాంతాలకు తరలించే ప్రసక్తే లేదు. ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మద్యం దుకాణాలన్నీ మూతపడతాయి" అని మధ్యప్రదేశ్ సీఎం ప్రకటించారు. నర్మదా నది పరివాహక ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిలోని మద్యం దుకాణాలు కూడా బంద్ అవుతాయని సీఎం తెలిపారు. దీనిపై డిప్యూటీ సీఎం జగదీశ్ దేవ్డా స్పందిస్తూ, తాము పూర్తిస్థాయి మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. సీఎం తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని కొనియాడారు.