Mother And Her Son Write 10th Exams : పెళ్లి, కుటుంబ సమస్యలు ఇలా వివిధ కారణాల వల్ల చదువును మధ్యలోనే వదిలేసిన వారు చాలా మంది ఉన్నారు. అయితే చదువుకోవాలనే ఆసక్తితో కొంతమంది పెళ్లి తర్వాత, మలి వయసులోనూ పరీక్షలు రాసే వ్యక్తుల గురించి అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. అలాంటి అరుదైన సన్నివేశం కర్ణాటకలో జరిగింది. తల్లి కుమారుడు కలిసి ఒకేసారి పదోతరగతి పరీక్షలు రాస్తున్నారు.
యాదగిరి జిల్లా సాగర గ్రామానికి చెందిన గంగమ్మ(32) మహిళ స్వయం సహాయక సంఘంలో వాలంటీర్‌గా పనిచేస్తున్నారు. అయితే మంచి ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. . కానీ గంగమ్మ 9వ తరగతి వరకే చదువుకుంది. పదోతరగతి సర్టిఫికెట్ కోసం గంగమ్మ ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయాలని నిర్ణయించుకుంది. అయితే గంగమ్మ కుమారుడు మల్లికార్జున శివన్నచౌడ గుండ కూడా ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. కర్ణటాకలో సోమవారం నుంచే పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో మల్లికార్జునతో పాటు తల్లి గంగమ్మ కూడా పదోతరగతి పరీక్షలు రాసేందుకు హాజరయ్యారు.
'నేను 9వ తరగతి వరకు చదువుకున్నా. ఆ తర్వాత పెళ్లైంది. అయినా స్కూల్‌కి వెళ్లాను. కానీ వ్యక్తిగత కారణాల వల్ల చదవడం మానేశాను. ప్రస్తుతం నేను వాలంటీర్‌గా పని చేస్తున్నాను. పదోతరగతి సర్టిఫికెట్ కోసం ఇప్పుడు పరీక్షలు రాస్తున్నా' అని గంగమ్మ తెలిపారు.