తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 7:03 PM IST

ETV Bharat / bharat

గుడ్ న్యూస్- ఈసారి నైరుతి రుతుపవనాలకు అన్నీ గ్రీన్ సిగ్నల్స్​! - monsoon forecast 2024 india

Monsoon Forecast 2024 India : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఎప్పుడొస్తాయి? వాటిని ఏఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి? 'ఎల్ నినో', 'లా నినో' ఎఫెక్ట్​ ఎలా ఉండబోతోంది? దేశ రైతులకు సానుకూలంగా పరిణమించే రీతిలో వర్షాలు కురుస్తాయా? ఈ అన్ని అంశాలపై భారత వాతావరణ విభాగం(ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర అందించిన విశ్లేషణ ఇది.

Monsoon Forecast 2024 India
Monsoon Forecast 2024 India

Monsoon Forecast 2024 India :దేశంలో అనేక ప్రాంతాలు తీవ్ర ఎండను ఎదుర్కొంటున్న తరుణంలో ఊరటనిచ్చే అంశాన్ని చెప్పారు వాతావరణ శాస్త్రవేత్తలు. ఈ ఏడాది ఎల్​నినో పరిస్థితులు తగ్గిపోవడం, యురేషియాలో తగ్గిన మంచు కవచంతో నైరుతి రుతుపవనాలు సానుకూలంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్​ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ''మనదేశంలో ఎల్ నినో క్షీణిస్తుండటం గుడ్ న్యూస్ లాంటిది. జూన్ నెల మొదలయ్యే సమయానికి ఎల్ నినో తగ్గిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే నైరుతి రుతుపవనాలు యాక్టివ్ అయిపోతాయి. రుతుపవనాల సీజన్ జులై-సెప్టెంబర్ రెండో అర్ధభాగంలో మన దేశంలో లా నినా పరిస్థితులు ఏర్పడొచ్చు'' అని ఆయన తెలిపారు.

మంచు కవచం ఎఫెక్ట్
దేశంలో రుతుపవనాలపై ఉత్తర హిమాలయాలు, యురేషియా భూభాగంపై ఉండే మంచు కవచం ప్రభావం చూపిస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. 'ఎల్ నినో' ఎఫెక్ట్​ కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఉత్తర హిమాలయాలు, యురేషియా భూభాగంపై మంచు కవచం తక్కువ మోతాదులోనే ఉందని, ఇది రుతుపవనాలకు కలిసొచ్చే పరిణామమని ఆయన పేర్కొన్నారు.

"గడిచిన కొన్నేళ్లలో సగానికిపైగా వ్యవధిలో (దాదాపు 60 శాతం) రుతుపవనాలపై ఎల్ నినో ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. గత ఏడాది (2023లో) రుతుపవనాల సీజన్‌లో మన దేశంలో సగటున 820 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. దేశవ్యాప్తంగా ఏటా కురిసే సగటు వర్షపాతం 868.6 మి.మీతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 'ఎల్ నినో' ఎఫెక్టు వల్లే గత సంవత్సరం వర్షపాతం తగ్గింది'' అని ఐఎండీ డైరెక్టర్ వివరించారు. కాగా, నైరుతి రుతుపవనాల సూచనలను ఈ నెలాఖరులోనే భారత వాతావరణ విభాగం(ఐఎండీ) విడుదల చేయనుంది.

నైరుతి రుతు పవనాలు మన దేశ వ్యవసాయ రంగానికి ఆరోప్రాణం లాంటివి. భారతదేశ వార్షిక వర్షపాతంలో 70 శాతాన్ని ఇవే అందిస్తాయి. భారత స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో 14 శాతం వాటాను నైరుతి రుతు పవనాలు ప్రభావితం చేస్తుంటాయి. ఇందులో ఎక్కువ భాగం వ్యవసాయ, దాని అనుబంధ రంగాల నుంచి సమకూరుతోంది. దేశంలోని 140 కోట్ల జనాభాలో దాదాపు సగం మంది జీవన ప్రమాణాలు, తలసరి వ్యయాలు నైరుతి రుతు పవనాల గమనం ఆధారంగానే నిర్ణయమవుతాయి. ఎందుకంటే నైరుతి రుతుపవనాల ప్రభావంతో చాలా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఈ వర్షపాతం ఆధారంగానే ఆయా ప్రాంతాలలో పంటల సాగు ఏ స్థాయిలో ఉంటుందనేది నిర్ణయమవుతుంది.

ABOUT THE AUTHOR

...view details