Modi On Ramoji Rao Demise :ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు (88) అస్తమయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సంతాపం ప్రకటించారు. ఆయన మరణం మీడియా, సినిమా రంగానికి తీరని లోటు అని రాష్ట్రపతి అన్నారు. ఆయన ఈనాడు, ఈటీవీ, ఫిల్మ్ సిటీ సంస్థలను నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పించారని తెలిపారు. సమాజ హితానికి రామోజీరావు చేసిన కృషికి పద్మ విభూషణ్ వరించిందని పేర్కొన్నారు. ఆయన సేవలు మరువలేనివని చెప్పారు. రామోజీ రావు కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
పాత్రికేయ, సినీరంగంపై చెరగని ముద్ర : మోదీ
పాత్రికేయ, సినీరంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారని ప్రధాని మోదీ కొనియాడారు. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ట్వీట్ చేశారు. రామోజీరావుతో మాట్లాడే అవకాశం తనకు ఎన్నోసార్లు దక్కిందని తెలిపారు.
"మీడియాలో రామోజీ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు. రామోజీరావు ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారు. ఆయనతో మాట్లాడే అవకాశం నాకు ఎన్నోసార్లు దక్కింది. రామోజీరావు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. రామోజీరావు అసంఖ్యాక అభిమానులకు నా సానుభూతి" అని మోదీ పోస్ట్ చేశారు.
రాజ్‌నాథ్ సింగ్ సంతాపం
రామోజీరావు అస్తమయంపై బీజేపీ అగ్రనేత రాజ్‌నాథ్‌సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. "మీడియా, చలనచిత్రాల రంగాల్లో తనదైన ముద్ర వేశారు. రామోజీరావు మృతి మీడియా, సినీరంగానికి తీరని లోటు. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి" అని రాజ్‌నాథ్‌సింగ్ ట్వీట్ చేశారు.
దూరదృష్టి గల వ్యక్తి రామోజీరావు : మల్లికార్జున ఖర్గే
"ప్రముఖ సినీ నిర్మాత, మీడియా సంస్థల అధినేత, విద్యావేత్త రామోజీరావు మరణం విచారకరం. మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన దూరదృష్టి గల వ్యక్తి ఆయన. సినిమా, పాత్రికేయ రంగానికి విశేష కృషి చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా" అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతాపం తెలియజేశారు.