Modi Guarantee Scheme Rumors: మోదీ గ్యారంటీ కింద రూ.3 వేలు వస్తాయనే ప్రచారంతో మహిళలు పోస్టాఫీస్‌ల వద్దకు ఎగబడ్డారు. పోస్టాఫీస్‌లో పొదుపు ఖాతాలను తెరిచేందుకు బారులు తీరారు. అవి తప్పుడు వార్తలు అని చెప్పినా సరే వినకుండా, మంగళవారం రాత్రి 8 గంటల వరకు తపాలా కార్యాలయాలకు నిరీక్షించారు. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్బల్లిలో జరిగింది.
ఇదీ జరిగింది
సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ తరచూ 'మోదీ గ్యారంటీ' అని వ్యాఖ్యానిస్తున్నారు. దీనిని ఆసరా చేసుకున్న కొంతమంది, మోదీ గ్యారంటీ కింద డబ్బులు వస్తాయని తప్పుడు వార్తలను ప్రచారం చేశారు. పోస్టాఫీస్‌లో పొదుపు ఖాతాలను తెరిచిన బీపీఎల్ కార్డ్ ఉన్న మహిళలకు ప్రతి మూడు నెలలకు రూ.3000 జమ అవుతాయని ప్రచారం జరిగింది. అయితే వీటిని నమ్మిన మహిళలు, మంగళవారం ఉదయం నుంచే ఖాతాలను తెరిచేందుకు హుబ్బల్లిలోని పలు పోస్టాఫీస్‌లకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో అధికారులు ఆరా తీయగా, డబ్బులు జమ అవుతాయనే ఖాతాలను తెరిచేందుకు వచ్చామని చెప్పారు. అయితే అవి తప్పుడు వార్తలని, అలాంటి పథకం ఏమి లేదని అధికారులు తెలిపారు. తపాలా కార్యలయాల ముందు కూడా అదంతా తప్పుడు సమాచారమని, వాటిని నమ్మవద్దని పోస్టర్లు పెట్టారు. అయినా సరే వినకుండా రాత్రి 8గంటల వరకు మహిళలు పోస్టాఫీస్‌లకు వచ్చారు.
'మాకు ఎలాంటి సంబంధం లేదు'
ఈ విషయంపై సీనియర్ పోస్ట్ మాస్టర్ ఎం కుమారస్వామి స్పందించారు. 'తప్పుడు వార్తలను నమ్మి మహిళలు పోస్టాఫీసు వచ్చారు. అలాంటి పథకం ఏమి లేదు. తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. పలు పోస్టాఫీస్‌ల వద్ద పోస్టర్లు అతికించినా మహిళలు వినడం లేదు. ఈ వార్తలతో మాకు ఎలాంటి సంబంధం లేదు' అని కుమారస్వామి స్పష్టం చేశారు.