GHMC Mayor Vijayalakshmi Inspected Hotels : హైదరాబాద్‌లోని పలు హోటల్స్, రెస్టారెంట్లపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లక్డీకాపూల్‌లోని మొఘల్ రెస్టారెంట్లో అధికారులతో కలిసి మేయర్ తనిఖీలు చేపట్టారు. హోటల్లోని కిచెన్‌ను పరిశీలించిన మేయర్ అవాక్కయ్యారు. అపరిశుభ్ర వాతావరణం, జిడ్డుకారుతున్న వంట సామాగ్రి, చాలా రోజులుగా ఫ్రిజ్‌లో నిల్వ ఉండి కుళ్లిపోయిన చికెన్, మటన్ చూసి హోటల్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆహార భద్రత చట్టాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : డ్రైనేజీ పైపులైన్ పక్కనే కిచెన్ ఉండటమేంటని ప్రశ్నించారు. కిచెన్‌లో ఉన్న ఆహార పదార్థాలు, మాంసం నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా తక్షణమే ఆ రెస్టారెంట్‌ను మూసివేయాలని అధికారులకు సూచించారు. నాణ్యత లేని ఆహారాన్ని, కల్తీ చేసి విక్రయిస్తున్న రెస్టారెంట్లు, హోటల్స్, వీధి వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తప్పవని మేయర్ విజయలక్ష్మి హెచ్చరించారు.
ఆహార భద్రతలో చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకంజ వేయవద్దని ఆదేశించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆహార భద్రతా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన మేయర్, నగరంలో ఇటీవల వెలుగు చూసిన ఘటనపై చర్చించారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి : హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్ వెండర్స్ విక్రయించే తినుబండారాలలో కల్తీ లేకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. తనిఖీల సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించ వద్దని మేయర్ ఆదేశించారు. ఫుట్ పాత్లపై తినుబండారాల స్టాళ్లను ప్రత్యేకంగా తనిఖీలు చేయాలన్నారు. నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆహార పదార్థాల విక్రయదారులందరికీ ట్రేడ్ లైసెన్స్ ఉండాలన్నారు. లేని వారందరూ ట్రేడ్ లైసెన్స్‌లు తీసుకునేలా సంబంధిత అధికారులు ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం అడిషనల్ కమిషనర్ పంకజ, ఆహార భద్రతా అధికారి మూర్తిరాజ్, పలువురు పుడ్ ఇన్స్పెక్టర్లతో కలిసి ఖైరతాబాద్, లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్ లోని రెస్టారెంట్లు, హోటళ్లలో మేయర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
'గ్రీజు'లా మారిన వంట నూనె - తినడానికి పనికిరాని మాంసం - ఆ హోటళ్లలో ఇవే వాడుతున్నారట!