Doctor Stabbed in Chennai : తన తల్లికి వైద్యం సరిగా అందించలేదని ఓ యువకుడు ప్రభుత్వ డాక్టర్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. పలుమార్లు పొడిచి, తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన తమిళనాడు చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్పందించారు. మరోవైపు ఈ దాడిని ఖండిస్తూ ప్రభుత్వ వైద్యులు సమ్మెను చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం- పెరుంగళత్తూర్కు చెందిన విఘ్నేశ్వరన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లి ప్రేమను చెన్నైలోని కలైంజ్ఞర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించాడు. ఆరు నెలలు పాటు ఆంకాలజీ విభాగంలో పనిచేస్తోన్న బాలాజీ జగన్నాథన్ అనే వైద్యుడు ఆమెకు చికిత్స అందించారు. అయినా ప్రేమ ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడలేదు. దీంతో అసహనానికి లోనైన విఘ్నేశ్వరన్ బుధవారం ఉదయం 10:30 గంటలకు తన తల్లి చికిత్స గురించి మాట్లాడాలని వైద్యుడి దగ్గరకు వెళ్లాడు. మాట్లాడుతుండగా డాక్టర్ బాలాజీపై తనతో తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించగా మిగతా వైద్య సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
డాక్టర్ బాలాజీని నిందితుడు సుమారు ఏడు సార్లు పొడిచినట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఈ దాడిలో వైద్యుడి ఛాతి, ముఖం, ఇతర భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయని, విపరీతంగా రక్తస్రవం జరిగిందని వివరించారు. బాలాజీని ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నామని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. నిందితుడు తల్లికి ఆరుసార్లు కీమోథెరపి ఇచ్చారని, ఆ తర్వాత ప్రైవేటు ఆస్పత్రికి తరలించారని తెలిపాయి. అయితే వైద్యుడు, నిందితుడు మధ్య ఏమి జరిగిందో స్పష్టంగా తెలియదని చెప్పాయి.
స్పందించిన సీఎం
ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించ స్టాలిన్ సమగ్ర విచారణకు ఆదేశించారు. సమయంతో నిమిత్తం లేకుండా సేవలు అందిస్తోన్న వైద్యుల కృషి ఎనలేనిదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
సమ్మెకు దిగిన ప్రభుత్వ వైద్యులు
మరోవైపు ఈ దాడిని ఖండిస్తూ తమిళనాడు ప్రభుత్వ వైద్యుల సంఘం సమ్మెను ప్రకటించింది. అత్యవసర సేవలు మినహా వైద్య విద్యార్థుల క్లాసులతో పాటు సర్జరీలు, ఓపీడీ సేవలను నిలిపివేసినట్లు ఓ ప్రకటనను విడుదల చేసింది.