Russia North Korea Defense Treaty : ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు సాయంగా ఇప్పటికే తమ సైన్యాన్ని పంపిన ఉత్తర కొరియా తాజాగా ఆ దేశంతో కీలక ఒప్పందం చేసుకుంది. ఇరుదేశాల మధ్య రక్షణరంగంలో కీలక ఒప్పందాలు చేసుకున్నాయని, జూన్‌లోనే సంతకాలు జరిగినట్లు ఉత్తరకొరియా మీడియా వెల్లడించింది. ఈ ఒప్పందాన్ని రష్యా పార్లమెంట్ కూడా ఆమోదించినట్లు పేర్కొంది.
ప్రపంచ దేశాల బహిష్కరణకు గురవుతున్న వేళ రష్యా, ఉత్తర కొరియా దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు సాయంగా వేలాదిమంది సైనికులు పంపిన కిమ్, తాజాగా ఆ దేశంతో బంధం పెంచుకునేందుకు మరో అడుగు ముందుకేశారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య స్నేహ బంధంపై ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్న వేళ కీలక ఒప్పందాన్ని చేసుకున్నాయి. తమపై దాడి జరిగితే ఆ రెండు దేశాలు సహకరించుకునేలా రక్షణ ఒప్పందాన్ని చేసుకున్నాయని, అందుకు సంబంధించి జూన్‌లోనే సంతకాలు చేసినట్లు ఉత్తర కొరియా మీడియా తెలిపింది.
జూన్‌లో ప్యాంగ్‌యాంగ్ పర్యటనకు వెళ్లిన పుతిన్, కిమ్‌తో పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారని వెల్లడించింది. అందులో రక్షణ ఒప్పందం కూడా ఉన్నట్లు ఉత్తర కొరియా పేర్కొంది. పుతిన్ పర్యటన సందర్భంగా పాశ్చాత్య దేశాలు తమ రెండు దేశాల్లో ఎవరిపై దాడి చేసినా పరస్పర సహాయం చేసుకుంటామని ఇరుదేశాల అధినేతలు స్పష్టం చేశారు. అయితే, ఏ తరహా సాయం అనే విషయం స్పష్టంగా వెల్లడించనప్పటికీ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యమని మాత్రమే అని పేర్కొన్నారు.
ఆమోదించిన రష్యా పార్లమెంట్
కిమ్‌తో రక్షణ ఒప్పందాన్ని రష్యా పార్లమెంట్ ఆమోదించినట్లు తెలుస్తోంది. రష్యా దిగువసభ గతనెలలో ఈ ఒప్పందాన్ని ఆమోదించగా, ఈ వారంలో ఎగువసభ ఆమోదం తెలిపినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అనంతరం ఈ ఒప్పందంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేసినట్లు వెల్లడించాయి. 2002 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేసినప్పటి నుంచి రష్యా, ఉత్తరకొరియా మధ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. కిమ్ ప్రభుత్వం రష్యాకు పెద్దఎత్తున ఆధునాతన ఆయుధాలను సరఫరా చేసినట్లు పాశ్చాత్య దేశాలు కొంతకాలం నుంచి చెబుతున్నాయి. రష్యా దాడులు జరిపిన ప్రదేశాల్లో ఉత్తర కొరియా ఆయుధాలను కనుగొన్నట్లు ఉక్రెయిన్ ఫోరెన్సిక్ నిపుణులు చెప్పారు.
రంగంలోకి దిగిన కిమ్ సేనలు
ఉక్రెయిన్ యుద్ధం, కొరియా ద్వీపకల్పంలో అమెరికా, దాని మిత్రపక్షాల మధ్య సైనిక భాగస్వామ్యం పెరగటం వల్ల కిమ్, పుతిన్ ప్రభుత్వాలు మరింత దగ్గరవుతున్నాయి. ఈ రెండుదేశాల స్నేహం పాశ్చాత్య దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు సహకరించేందుకు ఉత్తర కొరియా వేలాదిమంది సైనికులను పంపినట్లు ఆరోపణలున్నాయి. 11వేల మంది కిమ్ సైనికులు తూర్పు రష్యాలో శిక్షణ పొందారని ఉక్రెయిన్ ఇటీవల పేర్కొంది. ఈ నెలలోనే వారంతా కదన రంగంలోకి దిగినట్లు తెలిపింది. అయితే రష్యా ఇప్పటికి ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు.