Srivani Trust Tickets Demand : శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లకు రోజురోజుకూ డిమాండ్ భారీగా పెరుగుతోంది. ప్రతి రోజు తిరుమల గోకులం కార్యాలయంలో 800 కోటా టికెట్లను టీటీడీ జారీ చేస్తుండటంతో క్యూలైన్లో జనాలు బారులు తీరుతున్నారు. ఈ మధ్య 10 రోజులుగా మధ్యాహ్నం ఒంటి గంట కాగానే శ్రీవాణి ట్రస్టు టికెట్ల జారీ ప్రక్రియ పూర్తవుతోంది. రూ.10,500కు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేస్తొంది. సాధారణంగా ఉదయం 8:30 గంటలకు కౌంటర్లో టికెట్ల జారీని మొదలు పెడతారు.
వీటి కోసం ఏకంగా ఉదయం 6 గంటల నుంచే భక్తులు క్యూలైన్ వద్దకు చేరుకుని వేచి చూస్తున్నారు. అయితే శ్రీవాణి టికెట్లు కావాల్సిన భక్తులు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కచ్చితంగా కౌంటరులోకి వెళ్లి టికెట్లు తీసుకోవాల్సిందే. క్యూలైన్లలోకి చిన్న పిల్లలను సైతం తీసుకొని వెళ్లాల్సి రావడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లకు విపరీతంగా డిమాండ్ పెరిగి, ఒంటి గంట తర్వాత టికెట్లు లేకపోవడంతో టికెట్లు లభించని భక్తులు చాలా నిరాశతో వెనుతిరుగుతున్నారు.
తిరుమల విజన్-2047 పై సమీక్ష : ఇదిలా ఉండగా టీటీడీ ప్రక్షాళనలో భాగంగా ఆరు నెలల్లో కేవలం 10 శాతం మాత్రమే చేశామని ఈవో శ్యామలరావు వెల్లడించారు. ప్రక్షాళనలో భాగంగా స్వర్ణాంధ్ర విజన్- 2047లో అనుగుణంగా తిరుమల విజన్-2047తో దేవస్థానం చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి స్థానిక అన్నమయ్య భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు సామాన్య భక్తులకు పెద్ద పీట వేయాలని ఆదేశించారని తెలిపారు. దానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తాను ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో నెయ్యి నాణ్యత పెరగటానికి కృషి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం స్వామివారికి సమర్పించే ప్రసాదాలు, లడ్డూ ప్రసాదంకు వినియోగించే నెయ్యి స్వచ్చమైన ఆవు నెయ్యిదేనని స్పష్టం చేశారు.
మా లక్ష్యం పవిత్రతే: వెంకమాంబ అన్న వితరణ కేంద్రంలో భక్తులకు స్వీకరించే భోజనాల్లో నాణ్యతను సైతం పెంచామని ఈవో శ్యామలరావు తెలిపారు. అలాగే శ్రీవారి దర్శనానికి క్యూలైన్లలో భక్తులు వేచి ఉండే సమయం తగ్గించి, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపామని వెల్లడించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించామన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి ఒక మంచి అనుభూతిని ఇచ్చేలా మంచి కార్యక్రమాలను అందుబాటులోకి యాత్రను తీసుకొస్తామన్నారు. తిరుమలలో ఆధ్యాత్మికతను, పవిత్రతను కాపాడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.
కఠిన చర్యలు : దాతలు నిర్మించిన అతిథి గృహలు 47 ఉండగా వాటిలో 20 గృహాలకు ఆధ్యాత్మికమైన పేర్లు మార్చాలని ఈవో శ్యామలరావు తెలిపారు. అలిపిరి నడక మార్గంలో మంచి భద్రతతో సౌకర్యాలు, తిరుమలలో వాహనాల పార్కింగ్ కోసం సౌకర్యం పెంచాలన్నారు. టీటీడీలో అన్యమత ఉద్యోగుల బదలీపై న్యాయపరంగా ముందుకు వెళ్తున్నామని, వారికి స్వచ్ఛందంగా పదవి విరమణ చేసే అవకాశాల దిశగా ఆలోచిస్తున్నామని తెలిపారు. అనధికార దుకాణాల వల్ల భక్తులకు సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పారు. త్వరలో అనధికార దుకాణాలపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా టీటీడీకి 61 అనుబంధ ఆలయాలు ఉన్నట్లు గుర్తు చేశారు. కన్సల్టెన్సీ ద్వారా ఈ ఆలయాలను డెవలప్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద పార్కింగ్ సమస్యలు ఉన్నట్లు శ్యామలరావు వివరించారు. ఆకాశగంగ, పాపవినాశనం తీర్థాలకు భక్తుల తాకిడి ప్రస్తుతం పెరిగిందని, ఆ తీర్థాలను త్వరలోనే అభివృద్ధి అవసరం ఉందన్నారు. గత మూడు ఏళ్లలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ విభాగంలో లోటు పాట్లు జరిగాయని ఇకపై చర్యలు జరగకుండా ఒక కమిటీని వేసి జాగ్రత్త వహిస్తామన్నారు. ఆరు నెలలుగా టీటీడీ విజిలెన్స్ అధికారుల పని తీరు చాలా బాగుందని తెలిపారు. కొంతమంది దళారులు స్వామివారి దర్శన టికెట్ల పేరుతో భక్తులను బురిడీ కొట్టిస్తున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో తెలిపారు.
తిరుమల ప్రశాంతతను దెబ్బతీస్తే సహించేది లేదు: టీటీడీ ఛైర్మన్
తిరుమల శ్రీవారి దర్శనానికి ఎన్ని దారులో - ఇవి తెలిస్తే దర్శనం సులభమే