Model Code Of Conduct Rules: సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడం వల్ల దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీన్నే 'మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్' లేదా 'ఎన్నికల ప్రవర్తనా నియమావళి' అంటారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కొన్ని నియమాలను రూపొందించింది. అయితే, ఈ కోడ్ అమలులో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు, నేతలు చేయాల్సినవి, చేయకూడనవి ఏంటనేవి ఉంటాయి. ఎన్నికల ప్రచారం మొదలుకొని పోలింగ్ తేదీ వరకు పార్టీలు, నేతలు ఈ నియమాలకు లోబడి ఉండాల్సిందే. అయితే ఈ కోడ్ షెడ్యూల్ ప్రకటించిన తేదీ నుంచి ఫలితాలు విడుదలయ్యే వరకు అమల్లో ఉంటుంది. ఈ సమయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం సూచించింది. ఇంతకీ ఆ నియమాలేంటో తెలుసుకుందాం.
అధికార పార్టీలు
- కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల ప్రచారంలో తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. అలాగే ఓటర్లను ప్రభావితం చేసే విధంగా నిర్ణయాలు, ప్రాజెక్టులు, పథకాలు వంటివి ప్రకటించకూడదు.
- ఎన్నికల్లో గెలవడం కోసం అధికారంలో ఉన్న పార్టీలు ప్రజాధనాన్ని వినియోగించకూడదు. పత్రికల్లో, ఇతర మాధ్యమాల్లో ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు.
- మంత్రులు ఎన్నికల ప్రచారంలో అధికారిక వాహనాలను వినియోగించకూడదు. ఆ పర్యటనల్లో వారు ప్రభుత్వ అతిథి గృహాల్లో ఉండటానికి వీల్లేదు. తమ ఉనికిని తెలిపేలా సైరన్ ఉన్న వాహనాలను కూడా వాడకూడదు.
- ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లలో ఉన్న మంత్రులు, ఇతర రాజకీయ నాయకుల ఫొటోలు, రాజకీయ పార్టీల ప్రస్తావనలు మొదలైనవన్నీ తొలగించాల్సి ఉంటుంది. ఎటువంటి నియామకాలు కూడా చేపట్టకూడదు.
- ప్రభుత్వ మంత్రులు అభ్యర్థిగా లేదా ఓటరుగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు మాత్రమే వెళ్లాలి.
సమావేశాలు
- రాత్రి 10 తర్వాత బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. ఒకవేళ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించాలంటే స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి.
- కులాలు, మతాల మధ్య, వివిధ భాషలు మాట్లాడే వారి మధ్య చిచ్చు పెట్టడం కోడ్ ఉల్లంఘనే అవుతుంది.
- రాజకీయ నేతలు ప్రత్యర్థి పనితీరుపై విమర్శలు చేయొచ్చు. కానీ, వ్యక్తిగత దూషణలకు దిగకూడదు. అలాగే, కులం, మతం పేరుతో దూషించి ఎన్నికల్లో లబ్ధి పొందడం ఎన్నికల నియామావళికి వ్యతిరేకం.
- దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఇలా ఏ ప్రార్థనా మందిరాన్ని కూడా ఎన్నికల ప్రచారం కోసం వినియోగించకూడదు. ఓటర్లను ప్రలోభం పెట్టడం, వారిని బెదిరించడం వంటివి కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయి.
- ట్రాఫిక్కు అంతరాయం లేని విధంగా ప్రచారాలు, ఊరేగింపులు ఏర్పాటు చేసుకోవాలి. ఒకే సమయంలో పార్టీలు ర్యాలీలను నిర్వహిస్తే వాటిని వివరాలు పంచుకోవాలి.