Model Code Of Conduct Meaning : దేశంలో సాధారణ ఎన్నికలకు సైరన్ మోగింది. దీంతో దేశవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లోకి వచ్చింది. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పక పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తొలిసారి ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఏ శాసనసభ ఎన్నికల్లో దీన్ని అమల్లోకి తెచ్చారు? వంటి వివరాలు ఓసారి తెలుసుకుందాం.
తొలిసారి అప్పుడే
1960లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తొలిసారి భారత ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ను అమల్లోకి తెచ్చింది. అనంతరం గత అరవై ఏళ్లుగా దీనిని మరింత పటిష్ఠం చేస్తూ వచ్చింది. ఆ తర్వాత 1962 నుంచి అన్ని రాష్ట్రాలు, సాధారణ ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పోలింగ్, కౌంటింగ్‌ను పారదర్శకంగా, సక్రమంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేస్తారు.
వాటిని అరికట్టడమే లక్ష్యం
రాజకీయ పార్టీలు అధికార, ఆర్థిక దుర్వినియోగాన్ని అరికట్టడమే ఎన్నికల కోడ్ లక్ష్యం. దేశంలో అయినా, రాష్ట్రాల్లో అయినా ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలను రూపొందించింది. వీటినే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ పార్టీలు, వారి అభ్యర్థులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనులను పర్యవేక్షించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంటుంది.
ఎన్నికల కమిషన్‌కు పూర్తి అధికారం!
కేంద్ర ఎన్నికల సంఘం అధికారాలను, స్వయం ప్రతిపత్తిని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో సమర్థించింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు వాటిని ఉల్లంఘించిన రాజకీయ పార్టీలు, నేతలపై దర్యాప్తు చేయడానికి, వారికి శిక్ష విధించేందుకు ఎన్నికల కమిషన్‌కు పూర్తి అధికారం ఉంది. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన వెంటనే కోడ్ అమలులోకి వస్తుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అమలులో ఉంటుంది.