Balangir Human Sacrifice :ఒడిశా బలంగీర్ జిల్లాలో 13 ఏళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాలుడిని అడవిలోకి తీసుకెళ్లి హత్యచేసి వదిలేశారు గుర్తుతెలియని దుండగులు. ఈ హత్య కేసులో పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యను నరబలిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అసలేం జరిగిందంటే?
లాథోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జలియాలిటి గ్రామ సమీపంలో ఉన్న అడవిలో 13 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని సోమనాథ్ బివార్‌గా గుర్తించారు. గురువారం నుంచి సోమనాథ్ కనిపించకపోవడం వల్ల, అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముమ్మరంగా గాలించి బాలుడి మృతదేహాన్ని కనిపెట్టారు.
గ్రామస్థులతో కలిసి వెతుకులాట
జల్పంకేల్ గ్రామానికి చెందిన తపన్ బివార్ కుమారుడు సోమనాథ్ గురువారం సాయంత్రం 4 గంటల నుంచి కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. వెంటనే గ్రామస్థులు, కుటుంబ సభ్యులతో కలిసి సోమనాథ్ కోసం వెతికారు. ఎంత వెతికినా సోమనాథ్ ఆచూకీ తెలియకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నరబలి అనుమానం!
పౌర్ణమి రోజున తన కుమారుడిని ఎవరో నరబలి ఇచ్చారని సోమనాథ్ తండ్రి తపన్ బివార్ వాపోయారు. నరబలిని కొందరు పౌర్ణమి రోజు చేస్తారని తెలిపాడు. మృతదేహాన్ని పాతిపెట్టేందుకు ప్రయత్నించారని, కానీ ఎందుకో బయటే వదిలేశారని చెప్పుకొచ్చారు. మరోవైపు, సోమనాథ్ కోసం తాము రాత్రంతా నిద్రపోకుండా వెతికామని, కానీ అతడి ఆచూకీ దొరకలేదని గ్రామస్థుడు నారాయణ్ హన్స్ వెల్లడించారు.
గ్రామస్థుల ఆగ్రహం
కాగా, సోమనాథ్ హత్యపై అతడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్య చేసినవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నువాపాడ రోడ్డుపై బైఠాయించారు. ఈ విషయం పోలీసులకు తెలియడం వల్ల ఘటనాస్థలికి చేరుకుని నిరసనకారులకు నచ్చజెప్పారు. సైంటిఫిక్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో వచ్చి ఘటనాస్థలిలో దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని బాధితుడి కుటుంబ సభ్యులకు పోలీసులు చెప్పారు.
"మృతుడు గ్రామానికి చెందిన ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నాం. బాలుడి కుటుంబానికి, అనుమానితుడికి శత్రుత్వం ఉందని అనుమానం ఉంది. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. బాధితుడి కుటుంబ సభ్యుల ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్నాం" అని పట్‌నగర్ ఎస్‌డీపీఓ సదానంద పూజారి తెలిపారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం, 2014-2021 వరకు దేశంలో మొత్తం 103 నరబలి కేసులు నమోదయ్యాయి. 2015లో అత్యధికంగా 24 కేసులు, 2018లో అత్యల్పంగా నాలుగు కేసులు వెలుగుచూశాయి. 2014-2021 మధ్య ఛత్తీస్‌గఢ్‌లో 14, కర్ణాటకలో 13, ఝార్ఖండ్‌లో 11 కేసులు నమోదయ్యాయి.