RG Kar Docs Meeting With CM Mamata : కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటనపై ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులు గత కొన్ని రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను విరమించారు. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సోమవారం సాయంత్రం భేటీ అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా మంగళవారం రాష్ట్రంలోని ఆన్ని ఆస్పత్రుల్లో తలపెట్టిన సమ్మెను కూడా విరమించుకంటున్నామని ప్రకటించారు.
"ఈరోజు ముఖ్యమంత్రితో సమావేశం అయ్యాం. కొన్ని ఆదేశాలపై హామీ వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరిగా లేదు. సామాన్య ప్రజలు మాకు హృదయపూర్వకంగా మద్దతు ఇచ్చారు. ఆమరణ నిరాహార దీక్ష వల్ల క్షీణిస్తున్న మా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు, మా సోదరి(హత్యాచారానికి గురైన ఆర్జీ కర్ వైద్యురాలు) తల్లిదండ్రులు దీక్ష విరమించాలని కోరుతున్నారు. అందుకే మేము మా ఆమరణ నిరాహార దీక్షను ఉపసంహరించుకుంటున్నాము." అని జూనియర్ వైద్యులలో ఒకరైన దేబాశిష్ హాల్డర్ చెప్పారు.
అంతకుముందు రాష్ట్ర సచివాలయం నబన్నాలో సుమారు 2 గంటలపాటు సాగిన ఈ భేటీలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న థ్రెట్ కల్చర్‌పై ఇరువర్గాలు చర్చలు జరిపాయి. జూనియర్ డాక్టర్లు చేసిన పలు డిమాండ్‌లను నెరవేర్చామని, కనుక నిరాహార దీక్ష విరమించాలని మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. అయితే వైద్యులు తమ ముందుంచిన చాలా వరకు డిమాండ్లపై చర్యలు తీసుకున్నామని, కానీ స్టేట్ హెల్త్ సెక్రటరీని విధుల నుంచి తొలగించాలన్న డాక్టర్ల డిమాండ్‌ను మమతా బెనర్జీ మరోసారి తోసిపుచ్చారు.
"ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలో సరైన విధానాలు, నియమాలు పాటించకుండా చాలా మంది జూనియర్ డాక్టర్లు మరియు వైద్య విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఫిర్యాదుల ఆధారంగా ఈ విద్యార్థులు, రెసిడెంట్ వైద్యులను ఎలా సస్పెండ్ చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయకుండా ఇలాంటి చర్యలు తీసుకునే హక్కు కళాశాల అధికారులకు ఎవరు ఇచ్చారు? ఇది ముప్పు సంస్కృతి కాదా? అలాంటి చర్యలు పాల్పడి సస్పెండైన డాక్టర్లు థ్రెట్ కల్చర్‌లో భాగమే, అలాంటి వారు వైద్యులుగా ఉండటానికి అర్హులు కారు. అవసరమైతే అలాంటి వైద్యుల పనితీరును పరిశీలించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి." అని ఓ జూనియర్ వైద్యుడు అన్నారు.