Mayawati Akash Anand : బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తన రాజకీయ వారసుడిగా ఉన్న మేనల్లుడు, బీఎస్పీ జాతీయ సమన్వయకర్త ఆకాశ్ ఆనంద్‌పై వేటు వేశారు. యువనేతకు పూర్తి పరిపక్వత వచ్చేవరకు ఈ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు మంగళవారం రాత్రి ప్రకటించారు. కేవలం ఐదు నెలల్లోనే ఆయన పదవి కోల్పోవాల్సి వచ్చింది. తన సోదరుడు (ఆకాశ్ తండ్రి) ఆనంద్ కుమార్ ఇంతకుముందు మాదిరిగా పార్టీ జాతీయ సమన్వయ కర్త బాధ్యతలు నిర్వర్తిస్తారని మాయావతి చెప్పారు.
"బీఎస్పీ ఒక పార్టీ మాత్రమే కాదు. ఆత్మగౌరవం, సామాజిక మార్పు కోసం అంబేద్కర్ చేసిన ఉద్యమానికి కొనసాగింపు. కాన్షీరామ్, నేను జీవితం మొత్తాన్ని దానికోసమే అంకితం చేశాం. కొత్తతరాన్ని కూడా అందుకు సిద్ధం చేస్తున్నాం. ఈ క్రమంలో పార్టీలో కొత్త వ్యక్తులను ప్రోత్సహించడం కోసం ఆకాశ్ ఆనంద్‌ను జాతీయ సమన్వయకర్తగా, ఉత్తరాధికారిగా ప్రకటించాం. అయితే పార్టీ, ఉద్యమ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, పూర్తి పరిపక్వత సాధించే వరకు ఆయన్ని కీలక బాధ్యతల నుంచి దూరంగా ఉంచుతున్నాం. అప్పటి వరకు ఆయన తండ్రి ఆనంద్ కుమార్ పార్టీలో కీలక బాధ్యతలను నిర్వర్తిస్తారు" అని మాయావతి పోస్ట్ చేశారు.
ఇటీవల ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆకాశ్, యూపీలోని బీజేపీ ప్రభుత్వాన్ని బుల్డోజర్ గవర్నమెంట్‌గా అభివర్ణించారు. యువతను ఆకలితో ఉంచుతూ పెద్దలను బానిసలుగా మార్చుకుంటోందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం అధికారులు నియమావళి ఉల్లంఘన కింద నోటీసులు అందజేశారు. అదే సమయంలో ఆకాశ్‌తో పాటు ర్యాలీ నిర్వహించిన మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామం తర్వాత ఆయన ర్యాలీలన్నింటినీ బీఎస్పీ రద్దు చేసింది. ఇప్పుడు మాయవతి వేటు వేశారు.
'బీజేపీ ఒత్తిడి వల్లే ఈ నిర్ణయమా?'
అయితే మాయావతి తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ సమన్వయ కర్త పదవి నుంచి తప్పించిన తీరు షాకింగ్‌గా ఉందని కాంగ్రెస్ తెలిపింది. భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారా అని మాయావతిని కాంగ్రెస్ నేత సురేంద్ర సింగ్ రాజ్‌పుత్ ప్రశ్నించారు. ఈ వ్యవహారం బీఎస్పీ అంతర్గత విషయమే అయినప్పటికీ దీనిపై మాయావతి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.