Manipur Ethnic Violence : జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నర కాలంగా అట్టుడుకుతోన్న మణిపుర్‌లో ఇటీవల మళ్లీ హింస చెలరేగింది. ఇది హింసాత్మకంగా మారడం వల్ల గతేడాది మే నుంచి ఇప్పటి వరకు 258 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ వెల్లడించారు. మృతి చెందిన వారిలో మిలిటెంట్లు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. తాజాగా హింసాత్మక ఘటనలు మరింతగా పెరుగుతున్నందువల్ల, భారీ స్థాయిలో కేంద్ర బలగాలు రాష్ట్రానికి రానున్నాయని కుల్దీప్ సింగ్ చెప్పారు.
భద్రత పెంపు!
మణిపుర్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్న వేళ భారీ స్థాయిలో భద్రతా సిబ్బందిని కేంద్రం మోహరించింది. ఇప్పటికే దాదాపు 198 కంపెనీల బలగాలను రాష్ట్రంలో మోహరించారు. మరో 90 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు కూడా రాష్ట్రానికి రానున్నట్లు కుల్దీప్ సింగ్ వెల్లడించారు. రాష్ట్రంలో భద్రతను సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజాప్రతినిధుల నివాసాలపై జరిగిన దాడులకు సంబంధించి 32 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. దాదాపు 3000 ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
మణిపుర్‌లో వివిధ హింసాత్మక ఘటనల్లో హతులైన 9 మంది మృతదేహాల అప్పగింతపై కొద్ది రోజులుగా నెలకొన్న అనిశ్చితి శుక్రవారం తొలగిపోయింది. శవపరీక్ష అనంతరం అస్సాంలోని సిల్చర్ వైద్య కళాశాల ఆస్పత్రి నుంచి మృతదేహాలను తీసుకెళ్లడానికి బాధిత కుటుంబాలు నిరాకరిస్తూ వచ్చాయి. న్యాయం జరిగే వరకూ మృతదేహాలు తీసుకెళ్లబోమంటూ భీష్మించగా ఎట్టకేలకు అధికారులు వారిని ఒప్పించారు. దీంతో శుక్రవారం మృతదేహాలను మణిపుర్‌లోని జిరిబామ్‌కు తరలించారు. ఆ వెంటనే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మృతులకు అంత్యక్రియలు నిర్వహించారు. మైతేయ్ వర్గానికి చెందిన తొమ్మిది మంది మృతుల్లో ఆరుగురు ఈ నెల 11న అపహరణకు గురైన మహిళలు, చిన్నారులు ఉన్నారు. మరో ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల 11న హత్య చేశారు. ఇంకొకరు పోలీసుల కాల్పుల్లో మృతి చెందారని చెబుతున్నారు. ఈ ఘటనలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)తో దర్యాప్తు జరిపించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. ఈ నెల 11 జిరిబామ్ జిల్లాలో సాయుధ బలగాల కాల్పుల్లో మృతి చెందిన 10 మంది కుకీలను మిలిటెంట్లుగా ప్రకటించాలని వారు పట్టుబట్టారు. ఈ పది మంది కుకీల మృతదేహాలను ఈ నెల 16న చురాచాంద్‌పుర్‌కు తరలించారు.
భాజపా, కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు
మణిపుర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై భాజపా, కాంగ్రెస్ పార్టీల నేతలు పరస్పరం విమర్శలు సంధించుకున్నారు. అక్కడ శాంతిభద్రతలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కాంగ్రెస్ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే రాసిన లేఖపై భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా తీవ్రంగా స్పందించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మణిపుర్‌లోని స్థానిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, నేటి దుస్థితికి అదే కారణమని నడ్డా ఆరోపిస్తూ ఖర్గేకు లేఖ రాశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. నడ్డా లేఖ వాస్తవాలను వక్రీకరించేలా, తప్పుదారిపట్టించేలా ఉందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ధ్వజమెత్తారు.