Liquid Attack On Arvind Kejriwal :దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి లిక్విడ్‌ను చల్లాడు. పాదయాత్రలో భాగంగా ప్రజల మధ్య నుంచి అభివాదం చేస్తూ కేజ్రీవాల్ నడుస్తుండగా ఈ ఘటన జరిగింది. దీనితో అక్కడ తీవ్రమైన అలజడి ఏర్పడింది.
ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎలక్షన్స్!
ఫిబ్రవరిలో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మాలవీయ నగర్‌లో పాదయాత్ర చేస్తున్న కేజ్రీవాల్‌పై ఒక వ్యక్తి గుర్తు తెలియని ద్రవాన్ని చిమ్మడం కలకలం సృష్టించింది. అయితే వెంటనే అప్రమత్తమైన కేజ్రీవాల్ భద్రతాసిబ్బంది ఆ వ్యక్తిని వెనక్కిలాగేశారు. కోపంతో కేజ్రీవాల్ అభిమానులు అతడిపై దాడిచేశారు. నిందితుడిని కొట్టుకుంటూ కేజ్రీవాల్‌కు దూరంగా తీసుకెళ్లారు. పోలీసులు వెంటనే ఓ తాడుతో కేజ్రీవాల్ చుట్టూ భద్రతావలయంగా ఏర్పడ్డారు. నిందితుడు ఝా (41 ఏళ్లు) దిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఖాన్పుర్ డిపోలో బస్ మార్షల్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అతనిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, దాడికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వారు తెలిపారు
మాజీ ముఖ్యమంత్రికే రక్షణ లేదు!
కేజ్రీవాల్‌పై ఒక వ్యక్తి లిక్విడ్ ఎటాక్ చేయడంపై యాప్ పార్టీ తీవ్రంగా స్పందించింది. బీజేపీపై ఆప్ పార్టీ తీవ్రంగా మండిపడింది. దేశ రాజధానిలో ఒక మాజీ ముఖ్యమంత్రికే భద్రత లేనప్పుడు, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. దిల్లీలో శాంతిభద్రతలు క్షీణించాయని ధ్వజమెత్తింది. ఎందుకంటే దిల్లీలో శాంతిభద్రతలు కేంద్రహోం శాఖ పరిధిలో ఉంటాయి.
నిలువునా తగలబెట్టడానికి ప్రయత్నం!
తమ అధినేతను నిలువునా దహించేందుకు కుట్ర పన్నారని ఆరోపించింది. దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్, పాదయాత్ర సమయంలో కేజ్రీవాల్‌పై స్పిరట్ జల్లి, ఆయనకు నిప్పు పెట్టడానికి కుట్ర పన్నారని ఎక్స్ వేదికగా ఆరోపించారు. గత 35 రోజుల్లో కేజ్రీవాల్‌పై జరిగిన మూడో దాడి ఇది అని ఆప్ పార్టీ పేర్కొంది. నిందితుడు కాషాయ పార్టీ కార్యకర్త అని, ఇదంతా బీజేపీ కుట్ర అని దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ అన్నారు. అయితే ఆప్ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది.
దాడికి కారణం ఇదే!
నిందుతుడు ఝా విచారణలో, 'తనకు గత ఆరు నెలలుగా జీతం రాకపోవడం వల్ల తీవ్ర నిరాశకు గురయ్యానని పేర్కొన్నాడని సమాచారం. అంతేకాదు ఆప్ పార్టీ ఏర్పాటు సమయంలో తాను పార్టీకి విరాళం ఇచ్చానని, కానీ బూటకపు వాగ్దానాలతో కలత చెంది, చివరకి దాడికి పాల్పడినట్లు' చెప్పాడని సమాచారం.