Man Arrested After 40 Years :అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొని పరారీలో ఉన్న నిందితుడిని 40 ఏళ్ల తర్వాత ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు పాపా అలియాస్ దావూద్‌ను పోలీసులు ఆగ్రాలో అదుపులోకి తీసుకున్నారు. పాపాపై క్రిమినల్ కేసు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అసలేం జరిగిందంటే?
మహారాష్ట్రలోని ముంబయిలో పాపా అలియాస్ దావూద్ బంధు ఖాన్ అనే వ్యక్తి 1984లో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దావూద్‌పై డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 366, 376 కింద అత్యాచార నేరం కింద కేసు నమోదైంది. 1985లో ఈ కేసుపై బాంబే సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు పాపా హాజరుకాలేదు. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితుడు పాపా అలియాస్ దావూద్ పరారీలో ఉన్నట్లు సెషన్స్ జడ్జి ప్రకటించారు. అతడిపై స్టాండింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. అప్పటి నుండి దావూద్ పరారీలో ఉండడం వల్ల 40 ఏళ్లుగా ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండిపోయింది.
ఇల్లును అమ్మి ఆగ్రాకు పరార్
ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీస్ స్టేషన్ రికార్డుల్లో పరారీలో ఉన్న నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు ముంబయి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మోహిత్ కుమార్ గార్గ్ స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ క్రమంలో ముంబయిలో బాపురావ్ రోడ్లో ఉన్న పాపా ఇంట్లో తనిఖీలు చేపట్టినా అతడి అచూకీ లభించలేదు. నిందితుడి తండ్రి ముంబయిలో ఉన్న ఇంటిని అమ్మి కుటుంబంతో కలిసి ఉత్తర భారతదేశానికి వెళ్లిపోయాడని పోలీసులకు తెలిసింది. కచ్చితంగా ఎక్కడి వెళ్లారనే విషయం మాత్రం తెలియలేదు.