TMC Is Part Of INDIA Bloc :కేంద్రంలో ఇండియా కూటమి అధికారం చేపడితే, టీఎంసీ బయటి నుంచి మద్దతు ఇస్తుందన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. జాతీయస్థాయిలో భాజపా వ్యతిరేక కూటమిలో టీఎంసీ భాగంగా ఉన్నట్లు స్పష్టంచేశారు. పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న మమతా బెనర్జీ బెంగాల్లో మాత్రమే కాంగ్రెస్, సీపీఎంతో పొత్తు లేదన్నారు. నిన్న తాను చేసిన ప్రకటనను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. జాతీయ స్థాయిలో భాజపా వ్యతిరేక కూటమిలో తాను భాగస్వామిగా కొనసాగనున్నట్లు తేల్చి చెప్పారు. ఇండియా కూటమిని తానే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్న మమత - సీపీఎం, కాంగ్రెస్ బెంగాల్ శాఖలు కమలం పార్టీతో చేతులు కలిపాయని ఆరోపించారు.
నేను మమతా బెనర్జీని నమ్మను - అధిర్ రంజన్ చౌదరి
కాంగ్రెస్ నేత, బెంగాల్ పీసీసీ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి, తృణమూల్ పార్టీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఇంతకు ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తాను బయట నుంచి మద్దతు ఇస్తానన్న మమతా బెనర్జీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘ నేను మమతా బెనర్జీని నమ్మను, ఆమె ఇండియా కూటమిని విడిచిపెట్టింది. ఆమె బహుశా బీజేపీ వైపు వెళ్లవచ్చు’’ అని వ్యాఖ్యానించారు.
వైరం కొనసాగుతోంది!
మమతా బెనర్జీ - అధిర్ రంజన్ చౌదరి మధ్య కొన్ని రోజులుగా వైరం కొనసాగుతోంది. దీనికి తోడు ఇండియా కూటమికి బయట నుంచి సపోర్ట్ ఇస్తానని మమతా బెనర్జీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో, అధిర్ రంజన్ చాలా ఘాటుగా స్పందించారు. ప్రస్తుతానికి దేశంలో 70% స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇలాంటి సమయంలో మమతా బెనర్జీ వ్యాఖ్యలు కూటమిని ఇబ్బందుల్లోకి నెట్టింది. కానీ ఒక్కరోజు గడవక ముందే మమతా బెనర్జీ యూటర్న్ తీసుకున్నారు. తమ పార్టీ కూటమిలో భాగంగానే కొనసాగుతుందని స్పష్టం చేశారు.