Mamata Banerjee On Sandeshkhali Issue :సందేశ్‌ఖాలీలో మహిళల దుస్థితి చూసి తన హృదయం ముక్కలైందని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మహిళల భావోద్వేగాలతో భారతీయ జనతా పార్టీ ఆడుకుందని, ఇప్పుడు కాషాయ పార్టీ చేసిన కుట్రలన్నీ బయటపడుతున్నాయని మమత మండిపడ్డారు. బసీర్‌హాట్‌లో జరిగిన ఎన్నికల సభలో ప్రసంగించిన మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
సందేశ్‌ఖాళీ బాధితురాలు బీజేపీ అభ్యర్థి రేఖా పాత్రతో ప్రధాని ఫోన్‌లో మాట్లాడడాన్ని దీదీ తప్పుపట్టారు. బీజేపీ పాలనలో మహిళల భద్రత ప్రపంచంలోనే అత్యంత దారుణంగా ఉందని దీదీ ఆరోపించారు. సందేశ్‌ఖాలీలోని మహిళలు అవమానానికి గురైనందుకు తాను చింతిస్తున్నానని, తన హృదయం బాధతో నిండిపోయిందని, మహిళల గౌరవంతో ఎవరూ ఆడుకోకూడదని మమత అన్నారు.
ఇదంతా బీజేపీ కుట్ర
వీడియోలు బహిర్గతం అవ్వకపోతే, బీజేపీ కుట్రలు ఎలా పన్నుతుందో ఎవరికీ అర్థం కాకపోయేదని మమతా అన్నారు. బసీర్‌హాట్ లోక్‌సభ స్థానం నుంచి తమ అభ్యర్థి హాజీ నూరుల్ గెలిచిన వెంటనే, తొలుత తాను సందేశ్‌ఖాలీలోనే పర్యటిస్తానని మమతా హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎవరికైనా ఫోన్ చేయవచ్చని, కానీ ఆయన సందేశ్‌ఖాలీలోని రేఖకు ఫోన్ చేసి దీన్ని రాజకీయం చేశారని మమత మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యధికంగా దాడులు జరుగుతున్నాయని ఆమె గుర్తు చేశారు.