Mahayuti Wins Maharashtra Assembly Election :మహారాష్ట్రలో మహాయుతి విజయ ఢంకా మోగించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ మహాయుతి మరోసారి అధికారాన్ని ఛేజిక్కించుకుంది. మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ సగానికిపైగా స్థానాలు గెలుచుకుంది.
మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో మహాయుతికి స్పష్టమైన ఆధిక్యం వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ కూటమి 150 నుంచి 180 వరకు సీట్లు సాధిస్తుందని వెల్లడించాయి. ఎమ్వీఏకు 90 నుంచి 110 స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. ఈ అంచనాలకు అనుగుణంగానే మహాయుతి మెజారిటీ స్థానాల్లో పాగా వేసింది.
ఇటీవల జరిగిన హారియాణాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. అలానే మహారాష్ట్రలో కూడా ఎగ్జిట్ పోల్స్ తారుమారు అయి- తమ కూటమి విజయం సాధిస్తుందని ఎమ్వీఏ ధీమా వ్యక్తం చేసింది. కానీ ఫలితాలు మహాయుతికి అనుకూలంగా వచ్చాయి.
పథకాలు కీలక పాత్ర
2024 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహాయుతి(ఎన్డీఏ) ఘోర పరాజయం చవిచూసింది. అయితే, ఆ ఓటమి నుంచి వెంటనే తేరుకున్న మహాయుతి, అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. దీంతో ఎన్నికల ముంగిట సీనియర్ సిటిజెన్లు, విద్యార్థులు, మహిళలు- అన్ని వర్గాల వారిని ఉద్దేశించి పలు సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చింది. ఈ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ప్రభుత్వం మారితే పథకాలు రద్దవుతాయని ప్రచారం చేసింది. నిరుద్యోగం, ధరల పెరుగుదలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా- పథకాల వల్ల ప్రయోజనాలు అందుకున్న ప్రజలు మహాయుతి వైపు మొగ్గుచూపారు.
స్థానిక సమస్యలకు ప్రాధాన్యం
స్థానిక సమస్యలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చింది మహాయుతి కూటమి. దీంతో క్షేత్ర స్థాయిలో క్యాడర్‌ను బలోపేతం చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా, డబుల్ ఇంజిన్ సర్కార్, అయోధ్య రామ్ మందిరం వంటి జాతీయ విషయాలకు ఆ తర్వాత ప్రాధాన్యం ఇచ్చింది. మహారాష్ట్రలో ప్రజలు స్థానిక సమస్యలకు ఎక్కువ ప్రధాన్యం ఇస్తారని తెలుసుకున్న వ్యూహకర్తలు ఆ మేరకు ప్రణాళికలు అమలు చేశారు.
ముగ్గురు సీఎం అభ్యర్థులు
మహాయుతిలో ముగ్గురు సీఎం అభ్యర్థులు ఉన్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే ముఖ్యంగా సంక్షేమ పథకాలు, ఇమేజ్ బిల్డింగ్‌పై దృష్టి సారించారు. ఇక పరిస్థికి తగ్గట్టు త్వరగా నిర్ణయాలు తీసుకోవడంలో ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ నిష్ణాతులు. మరోవైపు, బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. వీరి ముగ్గురి అనుభవం మహాయుతి విజయంపై కీలక ప్రభావం చూపింది. ఇదే సమయంలో సిద్ధాంతాల పరంగా భిన్న దృవాలైన మహా వికాస్ అఘాడీ మిత్రపక్షాలు- అంతర్గత విభేదాలతో అధికార పక్షాన్ని అనుకున్నంత మేర అడ్డుకోలేకపోయాయి.
ప్రతికూలతలే- అవకాశాలుగా!
లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి, హరియాణాలో ఎన్నికల్లో విజయం - మహాయుతి వ్యూహ చరురతకు పదును పెట్టింది. పక్కా ప్రణాళికతో ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెట్టింది. రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అని ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ధాటిగా తిప్పికొట్టింది. అంతేకాకుండా మరో అడుగు ముందుకేసి బీజేపీ- "ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం", "విభజన అంటే విధ్వంసం" అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. వీటిని మిత్రపక్షాలు కూడా తప్పుబట్టాయి. ఈ కామెంట్స్ మహాయుతి నెగెటివ్‌గా మారతాయని అనుకున్నా, వాటి ప్రభావం ఓటర్లపై అంతగా పడలేదు.
అయితే అంతకుముందు మహాయుతి- ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత విమర్శలు చేసింది. అయితే అది పరోక్షంగా ఎమ్వీఏకు అనుకూలించి, మహాయుతి ఓట్లకు గండికొట్టింది. దీంతో మహాయుతి నేతలు రూటు మర్చారు. క్షేత్ర స్థాయి పరిస్థితులపై దృష్టిపెట్టారు. ప్రతిపక్షాలను ఒకే వర్గానికి అనుకూలం అని, పొలిటికల్ అబ్జర్వర్లు వంటి విమర్శలు చేశారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.
ఒకప్పుడు ఎన్సీపీని వ్యతిరేకించిన కారణంగా, క్షేత్ర స్థాయిలో బీజేపే, శివసేన(శిందే వర్గం) నేతలు- ఎన్సీపీ(అజిత్ పవార్)తో సఖ్యత లేదు. అయితే, కుటమిలో అంతర్గత రుసరుసల ప్రభావం ఓట్లపై పడనీయలేదు కూటమి అధిష్ఠానం.
ప్రాంతానికో ప్రణాళిక
లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ వ్యూహం మార్చుకుంది. స్థానిక సమస్యలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ప్రాంతాల వారిగా పరిస్థితులను బట్టి వ్యూహాలు, ప్రణాళికల్లో మార్పులు చేసింది. ఉదాహారణకు- ఆదివాసీలు ఎక్కువగా ఉన్న చంద్రపుర్ జిల్లాలోని చిమూర్‌లో ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఆదివాసీలు, దళితులు, ఓపీసీలపై ఉదారంగా వ్యవహరించడం వల్లనే ఆ వర్గాలు వెనుకబడ్డాయని తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా సోయాబీన్, పత్తి అధికంగా పండే విదర్భా ప్రాంతంలో సోయాబీన్ రైతలుకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఇలా ఎక్కడ సమస్యలను అక్కడే లేవనెత్తి, వాటికి పరిష్కారం తాము చూపుతామని ప్రచారంలో చేశారు. చివరకు సఫలమయ్యారు. మరోమారు అధికారం కైవసం చేసుకున్నారు.