Maharashtra India Alliance Seat Sharing :సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏను ఢీకొట్టడమే లక్ష్యంగా మిత్రపక్షాలతో సీట్లు సర్దుబాటు చేసుకుంటున్న కాంగ్రెస్, మహారాష్ట్రలో 18 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 48 లోక్‌సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఈ మేరకు మహావికాస్ అఘాడీ కూటమి పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. 48 గంటల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ఠాక్రే నేతృత్వంలోని శివసేన 20 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. ప్రాంతీయ పార్టీ అయిన వంచిత్ బహుజన్ అఘాడికి శివసేన 2 సీట్లు ఇచ్చేందుకు సిద్ధపడింది. శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ 10 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దించనుంది. ఒక స్వతంత్ర అభ్యర్థికి పవార్ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఇప్పటికే యూపీలో సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు వచ్చింది.
కాంగ్రెస్, ఆప్ మధ్య కుదిరిన పొత్తు
Congress AAP Seat Sharing :లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, ఆప్ మధ్య ఇటీవలే పొత్తు ఖరారైంది. దిల్లీ, గుజరాత్, హరియాణా, చంఢీగఢ్, గోవాలో సీట్ల సర్దుబాటు వివరాలను ప్రకటించారు. పొత్తులో భాగంగా దిల్లీలో ఆప్ నాలుగు, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ వెల్లడించారు. గోవాలో ఉన్న రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఇక గుజరాత్లో భరూచ్, భావ్ నగర్ స్థానాల్లో ఆప్ పోటీ చేస్తుందని చెప్పారు. మిగిలిన 24 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని వివరించారు. హరియాణాలో ఆప్ కురుక్షేత్ర స్థానం నుంచి పోటీ చేస్తుందని తెలిపారు. ఇక చంఢీగఢ్‌లో ఉన్న ఏకైక సీటులో కాంగ్రెస్ పోటీ చేయనుందని వెల్లడించారు. అయితే పంజాబ్‌లో మాత్రం కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆప్ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ తెలిపారు. పరస్పర అంగీకారంతోనే పంజాబ్‌లో వేర్వేరుగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మోదీ సారథ్యంలో BJP కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ- త్వరలో లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా
రాజ్యసభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహించిన సీఎం- హిమాచల్‌లో కాంగ్రెస్ సర్కార్ సేఫ్!