Maharashtra New CM :మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరో సోమవారం తేలిపోనుంది. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం సోమవారం జరగనుండగా, అందులో నిర్ణయం తీసుకుంటారని ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే చెప్పారు. ఈనెల 5న సీఎం ప్రమాణ స్వీకారం జరుగుతుందన్న ఆయన మహాయుతి కూటమిలోని మూడు పార్టీలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు సుపరిపాలన అందిస్తాయని పేర్కొన్నారు.
సస్పెన్స్‌కు తెరపడుతుందా?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, బీజేపీ శాసనసభాపక్షం సోమవారం సమావేశం కానుంది. ఇప్పటికే బీజేపీ నాయకుడే సీఎం అవుతారని స్పష్టం కాగా, సోమవారం జరిగే శాసనసభాపక్ష భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలు తమ నాయకుడ్ని ఎన్నుకోనున్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే చెప్పారు. శుక్రవారం తన స్వగ్రామానికి వెళ్లిన ఆయన, సుదీర్ఘ ఎన్నికల ప్రచారం కారణంగా అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. విశ్రాంతి తీసుకునేందుకే స్వగ్రామానికి వచ్చినట్లు వివరించిన శిందే, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు తీరుపై అసంతృప్తితోనే స్వగ్రామానికి వెళ్లినట్లు వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు మహాయుతి కూటమికి ఘన విజయం అందించారన్న శిందే, ఇప్పుడు తమ బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు కూటమి పార్టీలు కృషి చేస్తాయని తెలిపారు.
"నేను ఒక్కటే మాట చెప్పదలచుకున్నాను. ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఈ విషయంలో మా 3 పార్టీల మధ్య పరస్పర సమన్వయం ఉంది. మాకు ఏం దక్కిందనే కంటే, మేము ప్రజలకు ఏం ఇవ్వగలం, మహారాష్ట్రకు ఏం ఇవ్వగలమనేదే ముఖ్యం. ఎందుకంటే మా బాధ్యత మరింత పెరిగింది. ఎన్నికల్లో ప్రజలు మాకు భారీ మెజార్టీ కట్టబెట్టారు. వారిని అభివృద్ధి చేయాలి, ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలను ముందుకు తీసుకెళ్లాలి. ఈ దిశలో మేం పనిచేస్తాం." - ఏక్‌నాథ్ శిందే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి
మీరేమీ చింతించకండి!
ప్రమాణ స్వీకారం తేదీ, వేదిక ఖరారైనప్పటికీ సీఎం ఎవరో ఇంకా ప్రకటించలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి కదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు, 'సోమవారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఉంది. అందులో నిర్ణయం జరిగిపోతుంది. దాని గురించి మీరు ఎందుకు చింతిస్తున్నారు. ఐదో తేదీకి ఇంకా సమయం ఉంది కదా!' అని శిందే అన్నారు.
రాష్ట్రపతి పాలన ఎందుకు విధించలేదు!
ఎన్నికల్లో ప్రజలు ఘన విజయాన్ని కట్టబెట్టినప్పటికీ ముఖ్యమంత్రిని ఎంపిక చేయడంలో మహాయుతి కూటమి విఫలమవుతోందని శివసేన ఉద్ధవ్‌ఠాక్రే వర్గం నేత ఆదిత్య ఠాక్రే విమర్శలు గుప్పించారు. ఇది ప్రజల తీర్పును అవమానించడమేనని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను ఎందుకు విధించడం లేదని ఆయన ఎక్స్‌లో ప్రశ్నించారు.
మరోవైపు ముఖ్యమంత్రి పేరు ఇప్పటికే ఖరారైందని, కేంద్ర నాయకత్వం నిర్ధరణ కోసం ఎదురుచూస్తున్నామని బీజేపీ సీనియర్ నేత రావ్‌సాహేబ్ దాన్వే చెప్పారు. ఎవరు సీఎం అవుతారో మహారాష్ట్ర ప్రజలకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. కేబినెట్ కూర్పుపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని దాన్వే పేర్కొన్నారు.