- మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్
- మహారాష్ట్రలో 9 గంటల వరకు 6.61 శాతం నమోదు
- సాయంత్రం 6 వరకు కొనసాగనున్న పోలింగ్
- ఒకే విడతలో 288 నియోజకవర్గాల్లో పోలింగ్
- ఈనెల 23న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు
మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్ - ఉదయం 9 గంటల వరకు 6.61 శాతం ఓటింగ్
Published : 4 hours ago
|Updated : 4 hours ago
Maharashtra Assembly Elections 2024 Live Updates :మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. 9.63 కోట్ల మంది ఓటర్లు 4 వేల 136 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.
LIVE FEED
మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్
ఓటు హక్కు వినియోగించుకున్న సోనూసూద్
- ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించిన బాలీవుడ్ నటుడు సోనూసూద్
- జాన్ అబ్రహం, ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్ తదితర బాలీవుడ్ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు
- ఓటు హక్కును వినియోగించుకున్న ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్, బాబా సిద్ధిఖీ తనయుడు జీషాన్ సిద్ధిఖీ
- ఓటేసిన మహారాష్ట్ర సీఈవో చొక్కలింగం
- ఝార్ఖండ్‌లోని గిరిధిహ్‌లో ఓటేసిన ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బాబులాల్ మరాండి
ఓటేసిన ప్రముఖులు
- ముంబయిలో ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ముంబయిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్, సినీ నటుడు రాజ్ కుమార్ రావ్, నటి గౌతమీ కపూర్, నటులు అక్షయ్ కుమార్, అలీ ఫజల్ ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తొలి గంటల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- బారామతిలోని పోలింగ్ కేంద్రంలో ఎన్సీపీ (ఎస్పీ) నాయకురాలు, ఎంపీ సుప్రియా సూలే తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, తన భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి ముంబయి పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
ఓటేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగ్‌పుర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది బాధ్యత అని, ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించాలని భగవత్ అన్నారు. తాను ఉత్తరాంఛల్లో ఉన్నా, ఓటు వేయడానికి ఇక్కడికి వచ్చానన్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, రాజ్‌భవన్ వద్ద ఉన్న పోలింగ్ స్టేషన్లో ఓటేశారు. "భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం సీనియర్ పౌరులు, మహిళలు ఓటు వేయాలని నేను అప్పీల్ చేస్తున్నాను. వారికి నచ్చినవారికి ఓటర్లు ఓటు వేయొచ్చు, కానీ ఓటు హక్కు మాత్రం వినియోగించుకోవాలి. ఇది పౌరుల ప్రాథమిక బాధ్యత" అని రాధాకృష్ణన్ అన్నారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బారామతి ఎన్సీపీ అభ్యర్థి అజిత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బారామతి ఓటర్లు భారీ మెజారిటీతో తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
పోలింగ్ ప్రారంభం
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది.
ఎన్డీఏ VS ఇండియా
మహారాష్ట్ర ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ లక్షా 186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మహాయుతి పేరుతో NDA పక్షాలు, మహావికాస్ అఘాడీ పేరుతో ఇండియా కూటమి పోటీ పడుతున్నాయి. మహాయుతిలో భాగమైన బీజేపీ 149 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన 81, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆధ్వర్యంలోని NCP 59 మందిని బరిలో నిలిపింది. మహావికాస్ అఘాడీ-MVAలో భాగమైన కాంగ్రెస్ 101 మందిని నిలిపితే శివసేన యూబీటీ 95, NCPశరద్‌చంద్ర పవార్ పార్టీ 86 మందిని పోటీకి దించింది.