Russian Baba At Maha Kumbh Mela : తీరొక్క రకం బాబాలతో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా కళకళలాడుతోంది. దేశవిదేశాల నుంచి తరలివచ్చిన బాబాలు భక్తజనాన్ని ఆకట్టుకుంటున్నారు. రష్యాకు చెందిన బాహుబలి బాబా సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. 7 అడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహం, అందమైన ముఖ వర్ఛస్సును కలిగి ఉండటంతో ఆయన్ను అందరూ బాహుబలి బాబా అని పిలుస్తున్నారు. ఆయన వివరాలతో కథనమిది.
బాహుబలి బాబా సనాతన ధర్మంలోకి ఎలా వచ్చారు?
బాహుబలి బాబా అసలు పేరు ఆత్మప్రేమ్ గిరి మహరాజ్. ఈయన రష్యా దేశానికి చెందినవారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో టూరిస్టుగా ఈ బాబా తిరిగారు. ఈ క్రమంలోనే 30 ఏళ్ల క్రితం భారత పర్యటనకు రావడం ఆయనకు టర్నింగ్ పాయింట్‌గా మారింది. భారత పర్యటనలో ఉండగా సనాతన ధర్మంతో బాహుబలి బాబాకు పరిచయం ఏర్పడింది. హిందూ ధర్మం గొప్పతనాన్ని గ్రహించిన ఆయన, వెంటనే దాన్ని స్వీకరించారు. తన పేరును ఆత్మప్రేమ్ గిరి మహరాజ్‌గా మార్చుకున్నారు. ఈక్రమంలో పైలట్ బాబాకు శిష్యుడిగా మారిపోయారు. భారత్‌లోనే కొంతకాలం ఉండి హిందూ పురాణాలు, ఇతిహాసాలను చదివారు. దీని తర్వాత బాహుబలి బాబా నేపాల్‌కు వెళ్లి అక్కడే సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు. హిందూ ధర్మంలోకి ప్రవేశించకముందు ఆయన రష్యాలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. కుంభమేళా, మహాకుంభ మేళా జరిగినప్పుడల్లా బాహుబలి బాబా నేపాల్ నుంచి భారత్‌కు వచ్చి వెళ్తుంటారు.
సోషల్ మీడియాలో హల్‌చల్
ఆత్మప్రేమ్ గిరి మహరాజ్(బాహుబలి బాబా) సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ప్రకంపనలు సృష్టిస్తుంటారు. ఆయన ఆసక్తికర ఆధ్యాత్మిక ప్రసంగాలను చాలా మంది చూస్తుంటారు. బాహుబలి బాబా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లోని ఫొటోలను చూస్తే, ఆయనకు వ్యాయామం, యోగా, ధ్యానంపై ఎంతటి ఆసక్తి ఉందో అర్థమైపోతుంది. ఆహారం, పానీయాల విషయంలోనూ ఆయన ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు. దేహ సౌష్టవం ఆకట్టుకునేలా ఉండటంతో ఈ బాబాను కొందరు నెటిజన్లు భీముడు అని, మరికొందరు పరశురాముడు అని పిలుస్తుంటారు.