Lok Sabha Polls South India Target : లోక్‌సభ ఎన్నికల సమరానికి నగరా మోగింది. ఇంకొన్ని వారాల్లో ఓట్ల జాతర జరగనుంది. దీంతో దేశంలో పొలిటికల్ టెన్షన్ మొదలైంది. కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి వ్యూహలను సిద్ధం చేసుకుంటున్నాయి. హిందీబెల్ట్‌లో బీజేపీ హవా వీస్తున్నప్పటికీ, ప్రతిసారీ ఎన్నికల్లో దక్షిణ భారతదేశమే బీజేపీకి కొరకరాని కొయ్యగా మిగులుతోంది. దక్షిణాదిలో కొద్దిపాటి సీట్లను సాధించేందుకు కూడా బీజేపీ ముచ్చెమటలు కక్కాల్సి వస్తోంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ 370 లోక్‌సభ సీట్ల టార్గెట్‌ను అడ్డుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలను కీలకంగా వాడుకోవాలనే వ్యూహంతో హస్తం పార్టీ ముందుకుసాగుతోంది. ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న దక్షిణాది కోటను ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని కమలదళం ఉవ్విళ్లూరుతోంది.
తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి పరిధిలో మొత్తం 130 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వీటిలో బీజేపీ కేవలం 29 చోట్ల మాత్రమే విజయం సాధించగలిగింది. గెలిచిన ఈ సీట్లలో 25 కర్ణాటక, 4 తెలంగాణ నుంచి వచ్చాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలో బీజేపీ ఒక్క ఎంపీ సీటును కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది. ఈ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా సాగడం వల్ల అప్పట్లో కాంగ్రెస్ కూడా 28 సీట్లకే పరిమితమైంది. తమిళనాడులో 8, తెలంగాణలో 3, కేరళలో 15, కర్ణాటక, పుదుచ్చేరిలలో ఒక్కో సీటును హస్తం పార్టీ గెలుచుకుంది. మొత్తం మీద కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లోనూ కొంతమేర తన ఉనికిని చాటుకోగలిగింది.
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిలో పరిణామాలు చాలా మారాయి. అవేమిటంటే కర్ణాటక, తెలంగాణలలో కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. కర్ణాటకలో బీజేపీని, తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తమిళనాడులో డీఎంకే సారథ్యంలోని బలమైన సంకీర్ణ కూటమిలో కాంగ్రెస్ భాగస్వామ్యపక్షంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, పుదుచ్చేరిలలోనూ హస్తం పార్టీకి బలమైన ఉనికే ఉంది. ఈ కారణాల వల్లే దక్షిణాది రాష్ట్రాల నుంచి తమకు ఎక్కువ సీట్లు వస్తాయని కాంగ్రెస్ గంపెడు ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ ఆధిపత్యం చెలాయించే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో దక్షిణాదిలో సత్తాచాటుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. 2019లో జరిగిన ఎన్నికల్లో హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో బీజేపీ 185 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ మాత్రం హిందీ బెల్ట్‌లో తక్కువ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
కర్ణాటక
కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పనితీరు కనబరిచిన తర్వాత పరిస్థితులు ఈసారి అనుకూలంగా మారొచ్చు. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేశారు. రాష్ట్ర ప్రజల కోసం అమలు చేస్తున్న ఉచిత హామీలు తమకు ఓట్లు రాలుస్తాయని, విజయాన్ని అందిస్తాయనే ధీమాతో కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు ఉంది. మరోవైపు జేడీఎస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీచేసి రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని సాధించాలనే పట్టుదలతో బీజేపీ ఉంది.