Lok Sabha Polls 2024 Second Phase : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6వరకు పోలింగ్ జరగనుంది. కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ సహా 12 రాష్ట్రాల్లోని 88 నియోజకవర్గాల్లో ఈ విడతలో ఓటింగ్ జరగనుంది. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకునేలా కేంద్రం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. పెద్దఎత్తున భద్రతా బలగాలను మోహరించింది.
రాష్ట్రాల వారీగా ఇలా!
కేరళలో మొత్తం 20 స్థానాలకు, కర్ణాటకలో 14, రాజస్థాన్ 13, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లో 8చొప్పున, మధ్యప్రదేశ్‌లో 6, అసోం, బిహార్‌లో ఐదు చొప్పున, ఛత్తీస్‌గఢ్, బంగాల్‌లో మూడు చొప్పున, మణిపుర్, త్రిపుర, జమ్ముకశ్మీర్‌లో ఒక్కోస్థానానికి ఓటింగ్ జరగనుంది. కేరళలోని మొత్తం 20 స్థానాలకు ఈ విడతలో పోలింగ్ జరగనుంది. మొత్తం 194మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు.
కేరళలో త్రిముఖ పోరు
కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF, సీపీఎం సారథ్యంలోని LDF, బీజేపీ సారథ్యంలోని NDA మధ్య త్రిముఖ పోరు నెలకొంది. కేరళలో 2.77కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 5 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు పొందినవారు ఉన్నారు. వారి కోసం 25,231 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసిన ఈసీ, ప్రశాంతంగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా 66వేలకుపైగా భద్రతాదళాలను మోహరించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని UDF 19 స్థానాలు గెలుపొందగా సీపీఎం నేతృత్వంలోని LDF ఒక్క స్థానానికే పరిమితమైంది.
కర్ణాటకలో పరిస్థితి ఇలా!
కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ సీట్లు ఉండగా, 14 స్థానాలకు శుక్రవారం ఓటింగ్ జరగనుంది. మొత్తం 247 మంది పోటీ చేస్తున్నారు. ఈ విడతలో 2.88కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారి కోసం 30వేల 602 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ 14 చోట్ల పోటీ చేస్తుండగా, భారతీయ జనతా పార్టీ 11, ఎన్డీఏ భాగస్వామి జేడీఎస్ 3 స్థానాల్లో బరిలో ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ 14 స్థానాలకుగాను బీజేపీ 11 చోట్ల, ఆ పార్టీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి ఒక చోటు నెగ్గారు. అప్పట్లో మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ చెరో లోక్‌సభ స్థానంలో విజయం సాధించాయి. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారం చేపట్టిన హస్తం పార్టీ ఈసారి గట్టి పోటీ ఇస్తోంది.