Lok Sabha Election 2024 Voters List :రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు దేశవ్యాప్తంగా దాదాపు 97 కోట్ల మంది అర్హులు ఉన్నట్లు ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించింది. వారిలో 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు ఉన్న రెండు కోట్ల మంది యువత ఓటర్ల జాబితాలో చేరారని తెలిపింది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఓటర్లలో 6 శాతం పెరుగుదల నమోదైనట్లు పేర్కొంది.
కఠిన పరిశీలన తర్వాత ఈ తుది ఓటర్ల జాబితాను రూపొందించినట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. అందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి సమగ్ర ధ్రువీకరణ తర్వాత 67.82 లక్షల మంది చనిపోయినవారి పేర్లు, 22.05 లక్ష నకిలీ ఓట్లను తొలగించినట్లు పేర్కొంది. ముఖ్యంగా గిరిజనలను ఓటర్ల జాబితాలో నమోదు చేయడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేసినట్లు తెలిపింది.
ఎన్నికల సంఘం వివరాల ప్రకారం, ఓటుకు అర్హులైనవారిలో దాదాపు 1.84 కోట్ల మంది 18 నుంచి 19 ఏళ్లలోపు వారు ఉన్నారు. 2023తో పోల్చితే లింగ నిష్పత్తి 940 నుంచి 2024లో 948కి చేరినట్లు వెల్లడించింది.
- మొత్తం ఓటర్లు : 96.88 కోట్లు (96,88,21,926)
- పురుషులు : 49.72 కోట్లు (49,72,31,994)
- మహిళలు :47.15 కోట్లు (47,15,41,888)
- 20-29 ఏళ్ల వయసున్న వారు : 19.74 కోట్లు (19,74,37,160)
- దివ్యాంగులు :88,35,449
- వందేళ్లు పైబడినవారు : 2,38,791
- ఓటర్లు / జనాభా నిష్పత్తి : 66.76
- లింగ నిష్పత్తి : 948