Lok Sabha Election 2024 AAP Assam : సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే పంజాబ్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ, మరోసారి కీలక ప్రకటన చేసింది. అసోం నుంచి ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. ఇండియా కూటమి తమ నిర్ణయాన్ని స్వాగతిస్తుందని ఆశిస్తున్నట్లు ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ తెలిపారు. డిబ్రూగఢ్ నుంచి మనోజ్ ధనోహర్, గువాహాటి నుంచి భవెన్ చౌదరి, సోనిత్‌పుర్ నుంచి రిషి రాజ్‌ను బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించారు.
సీట్ల సర్దుబాటుపై ఇండియా కూటమితో జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడం వల్ల విసిగిపోయామని ఎంపీ సందీప్ పాఠక్ చెప్పారు. ఎన్నికల్లో గెలవడమే ముఖ్యమని, తాము కూటమితోనే ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలకు ఇంకా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉందని, మూడు స్థానాలకు వెంటనే సన్నాహాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇండియా కూటమిలో నిర్ణయాలు త్వరగా తీసుకోవాలని కోరారు.
కొన్నిరోజుల క్రితం, రాష్ట్రంలో కాంగ్రెస్‌తో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాంటి పొత్తు లేదని పంబాజ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. పంజాబ్‌లో ఆప్ ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 13 సీట్లను ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు భగవంత్ మాన్.
అయితే ఇండియా కూటమి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కూటమిలో కీలక నేత అయిన జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ హ్యాండ్ ఇచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో కీలక పార్టీ ఆర్ఎల్డీ సైతం కూటమిని వీడనున్నట్లు తెలుస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌తో ఉన్న పొత్తు నుంచి బయటకు వచ్చేందుకు ఆ పార్టీ అధినేత జయంత్ చౌదరీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చలు కూడా జరిగాయట. ఆర్ఎల్డీ నేతలు ఏడు లోక్‌సభ స్థానాలను డిమాండ్ చేయగా, బీజేపీ 5సీట్ల వరకు ఇచ్చేందుకు సానుకూలత చూపెట్టిన్నట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరీ త్వరలోనే ప్రకటన చేయనున్నారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.