MVA On Maharashtra CM Candidate :త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే విషయంపై శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. మహాయుతి కూటమి తర్వాతే మహావికాస్ అఘాడీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని తెలిపారు. ప్రస్తుతం మహాయుతి కూటమి ప్రభుత్వంలో ఉన్నందున, వారే తొలుత ప్రకటించాలని అన్నారు. బీజేపీ నేతల పరిస్థితి దారుణంగా ఉందని, వారంతా ద్రోహుల నాయకత్వంలో పోటీ చేయనున్నారని విమర్శించారు. మహా వికాస్ అఘాడీ నాయకులతో కలిసి ఆదివారం ముంబయిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్ధవ్ రాక్రే ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
నేరస్థులను చూసీ చూడనట్లు వదిలేస్తుంది!
ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అనుమానాలు తలెత్తుతున్నాయని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఇప్పటికే అరెస్ట్ అయిన వారు నిందితులో కాదో తమకు తెలియదని అన్నారు. తమ కదలికలపై నిఘా పెట్టిన సర్కార్, నేరస్థులను చూసి చూడనట్లు వదిలేస్తుందని ఆరోపించారు. అది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. సీఎం అభ్యర్థి విషయంపై ఉద్ధవ్ చేసిన వ్యాఖ్యలను ఎన్సీపీ-ఎస్పీ వర్గం అధినేత శరద్ పవార్ సమర్థించారు. ఉద్ధవ్ ఠాక్రే చెప్పింది స్పష్టంగా ఉందని అన్నారు.
కూటమి పాలనలో మహారాష్ట్ర ధ్వంసం!
మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అది త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కనిపిస్తుందని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. మహాయుతి కూటమి పాలనలో మహారాష్ట్ర ధ్వంసమైందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్యులను అపహాస్యం చేసేలా ఉన్నాయని విమర్శించారు. మహాయుతి కూటమి ప్రభుత్వం నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, అందుకు వారు తమ కూటమికి మద్దతిస్తారన్న నమ్మకం తమకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.