Lawrence Bishnoi interview : పోలీసు కస్టడీలో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ను ఇంటర్వ్యూ చేసిన కేసులో ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్ ర్యాంక్ అధికారులతో సహా ఏడుగురు సిబ్బందిని పంజాబ్ పోలీసులు సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిట్ గుర్తించడం వల్ల సస్పెన్షన్ వేటు పడింది.
అసలేం జరిగిందంటే?
లారెన్స్ బిష్ణోయ్ కస్టడీలో ఉన్న సమయంలో టీవీ ఇంటర్వ్యూకు అనుమతించినందుకు అక్కడి అధికారులపై పంజాబ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2023 మార్చిలో ఒక టీవీ ఛానల్లో లారెన్స్‌కు సంబంధించిన రెండు ఇంటర్వ్యూలు ప్రసారమయ్యాయి. ఈ వ్యవహారంపై పంజాబ్ - హరియాణా కోర్టు సిట్‌ను ఏర్పాటుచేసింది. పంజాబ్ జైలు నుంచి వీడియో కాల్ ద్వారా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడని సిట్ గుర్తించింది. మరొక ఇంటర్వ్యూను జయపురలోని సెంట్రల్ జైలులో ఇచ్చాడు లారెన్స్ బిష్ణోయ్.
ఏడుగురిపై వేటు
జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్య్యూకు సహకరించిన ఏడుగురిపై వేటు వేసినట్లు పంజాబ్ హోం సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. వేటు పడిన అధికారుల్లో గుర్షేర్ సింగ్(డీఎస్పీ), సమర్ వినీత్(డీఎస్పీ), రీనా(ఎస్ఐ), జగపాల్ జంగూ(ఎస్ఐ), షాగింత్ సింగ్(ఎస్ఐ), ముక్తియార్ సింగ్(ఏఎస్ఐ), ఓం ప్రకాశ్(హెచ్ కానిస్టేబుల్) ఉన్నారు. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులందరినీ సస్పెండ్ చేశామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒక ప్రైవేట్ టీవీ ఛానల్లో ప్రసారమైన బిష్ణోయ్ ఇంటర్వ్యూను 2022 సెప్టెంబర్ 3న అర్ధరాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీశారని వెల్లడించారు.
జైల్లోనే ఉంటూ హత్యలకు ప్లాన్స్!
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కొన్నేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. బ్యారక్‌ల్లోకి అక్రమంగా వచ్చే సెల్ ఫోన్ల ద్వారా అనుచరులతో నిరంతరం టచ్‌లో ఉంటూ హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. గాయకుడు సిద్ధూ మూసేవాలా, ఎన్ సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీపై దాడులు ఈవిధంగానే చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై పలుమార్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు పాల్పడింది. గతేడాది రెండుసార్లు సోషల్ మీడియా, ఈమెయిల్స్ ద్వారా సల్మాన్‌కు బెదిరింపు హెచ్చరికలు పంపింది. చివరిసారిగా 2023 నవంబర్‌లో 'మరణానికి వీసా అవసరం లేదు' అంటూ సల్మాన్‌ను హెచ్చరించారు. అయితే కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్ దెబ్బతీశారంటూ 2018లో లారెన్స్ బిష్ణోయ్ వ్యాఖ్యానించాడు. ఇదే విషయంపై సల్మాన్‌కు మెయిల్‌లో బెదిరింపులు వచ్చినట్లు గతంలో పోలీసులు పేర్కొన్నారు.