Kuwait Fire Tragedy :రెండు రోజుల క్రితం ఎడారి దేశం కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల మృతదేహాలు శుక్రవారం ఉదయం భారత్‌కు చేరుకున్నాయి. ఐఏఎఫ్‌కు చెందిన ప్రత్యేక విమానం 45 మంది భారతీయుల మృతదేహాలతో కొచ్చి విమానాశ్రయానికి చేరుకుంది. అదే విమానంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కూడా ఉన్నారు. కొచ్చి విమానాశ్రయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, మంత్రులు కే రాజన్, పీ రాజీవ్, వీణా జార్జ్ భారతీయుల 45 మృతదేహాలను స్వీకరించారు. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోడియం వద్ద మృతదేహాలకు సీఎం, మంత్రులు, అధికారులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కేరళ మంత్రులను కలిశారు.
కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడానికి భారత్ గురువారం రాత్రి సైనిక రవాణా విమానాన్ని పంపింది. ఈ ప్రత్యేక విమానం కేరళకు చెందిన 23, తమిళనాడుకు 7, కర్ణాటకకు చెందిన ఒక మృతదేహం సహా ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 14 మృతదేహాలతో కొచ్చి విమానాశ్రయానికి శుక్రవారం ఉదయం చేరుకుంది. కాగా, బాధితుల మృతదేహాలను వారి ఇళ్లకు అంబులెన్స్‌లో అధికారులు తరలించారు. తమిళనాడు, కర్ణాటకకు మృతదేహాలను తీసుకెళ్లే అంబులెన్స్లకు తోడుగా కేరళ పోలీసు పైలట్ వాహనాన్ని ఏర్పాటు చేశారు.
'నాకు అనుమతి ఇవ్వలేదు'
అగ్నిప్రమాద సహాయక చర్యల సమన్వయం కోసం కువైట్ వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం తనకు అనుమతి ఇవ్వలేదని కేరళ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. గల్ఫ్ దేశంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో కేరళకు చెందిన వారికి అండగా ఉండడం, సహాయక చర్యలను సమన్వయం చేయడం కోసమే ఈ పర్యటన ఉద్దేశమని చెప్పారు. అయినా తనకు కేంద్ర ప్రభుత్వం కువైట్ వెళ్లేందుకు అనుమతి నిరాకరించిందని వాపోయారు. కాగా, కువైట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు చికిత్స, మృతులను స్వదేశానికి రప్పించడం సహా సహాయక చర్యలకు సహకరించేందుకు మంత్రి వీణా జార్జ్‌ను కువైట్‌కు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆమె విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతి కోసం విమానాశ్రయం వద్ద గంటల తరబడి నిరీక్షించినట్లు తెలుస్తోంది. అయినా ఆమెకు కేంద్రం అనుమతి నిరాకరించింది.