Kolkata PGT Doctor Murder Case :కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కళాశాల జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తున్న వేళ- ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు సంజయ్ రాయ్ వైద్యురాలిని హత్యాచారం చేసిన రాత్రి హాయిగా నిద్రించాడని తెలిసింది. ఉదయం లేచి సాక్ష్యాలను చెరిపేసేందుకు దుస్తులపై ఉన్న రక్తపు మరకలను ఉతుక్కున్నాడు. ఐతే అతడి బూట్లపై ఉన్న రక్తపు మరకల ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. పౌర వాలంటీరైన నిందితుడికి ఆస్పత్రితో ఎలాంటి సంబంధం లేదని, అప్పుడప్పుడు అక్కడకు వెళ్తాడని తేలింది. కేసులో ఇతరుల ప్రమేయంపై ఆధారాలు లభించలేదు.
'చివరిసారిగా నీరజ్ చోప్రా మ్యాచ్ చూసి!'
సంజయ్ రాయ్ దర్యాప్తు సమయంలో ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోగా, ఉరి తీయాలనుకుంటే తీసుకోవాలని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అతడి ఫోన్ నిండా అశ్లీల వీడియోలు ఉన్నట్లు తెలిసింది. సంజయ్‌కు ఇప్పటికే 4 పెళ్లిళ్లు జరిగినట్లు సమాచారం. ఘటనకు కొన్ని గంటల ముందు వైద్యవిద్యార్థిని స్నేహితులతో కలిసి ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్‌ను వీక్షించినట్లు తెలిసింది. సహచరులతో కలిసి డిన్నర్ చేశాక తల్లికి ఫోన్ చేసి మాట్లాడినట్లు స్నేహితులు చెప్పారు. అనంతరం సెమినార్ హాల్‌లో చదువుకునేందుకు వెళ్లిందన్నారు.
మరోవైపు, ఘటన వివరాలు తెలుసుకునేందుకు కోల్‌కతా చేరుకున్న ఇద్దరు జాతీయ మహిళా కమిషన్ సభ్యుల బృందం పోలీసులతో చర్చించింది. అనంతరం మృతురాలి కుటుంబాన్ని పరామర్శించింది.
బాధితులకు న్యాయం చేయాలి : ప్రియాంక గాంధీ
వైద్యురాలి హత్యాచారం కేసులో కఠిన చర్యలు తీసుకొని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మమత ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కోరారు. పని ప్రదేశాల్లో మహిళల భద్రత పెద్ద సమస్య అని, ఇందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రియాంక సూచించారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని దేశవ్యాప్తంగా డాక్టర్లు, వైద్యవిద్యార్థులు భారీ నిరసన చేశారు. ఆస్పత్రుల్లో కేంద్ర రక్షణచట్టం అమలుకు కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 3 లక్షల మంది డాక్టర్లు నిరసనల్లో పాల్గొన్నారు.