Kolkata Doctor Rape-Murder Case Updates :కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం దేశమంతా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ, నిందితుడికి సంబంధించిన మరొక జుగుప్సాకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు సంజయ్ రాయ్ బాధితురాలిపై హత్యాచారానికి ఒడిగట్టేముందు, కోల్‌కతాలోని రెండు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు కోల్‌కతా పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. 'ఘటన జరిగిన ఆగస్టు 8న రాత్రి పూట సంజయ్ రాయ్ మద్యం సేవించి, ఆసుపత్రికే చెందిన మరో సివిక్ వాలంటీర్‌తో కలిసి కోల్‌కతాలోని ‘రెడ్ లైట్ ఏరియా’లకు వెళ్లాడు. వీరిద్దరు కలిసి ఓ టూ-వీలర్‌ను అద్దెకు తీసుకొని, తొలుత సోనాగచికి అర్ధరాత్రి సమయంలో వెళ్లారు. అక్కడ రాయ్ వ్యభిచార గృహం బయట నిలుచోగా, అతడి మిత్రుడు లోపలికి వెళ్లాడు. అనంతరం రాత్రి 2 గంటల సమయంలో దక్షిణ కోల్‌కతాలోని ఓ వ్యభిచార గృహానికి వెళ్లారు. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను కూడా సంజయ్ రాయ్ వేధింపులకు గురిచేశాడు. మద్యం మత్తులో ఉన్న అతను, ఆమె నగ్న చిత్రాలు కావాలని అడిగాడు. ఉదయం 3.50 గంటల సమయంలో రాయ్ ఆర్‌జీకార్ ఆసుపత్రికి చేరుకున్నాడు. తొలుత ఆపరేషన్ థియేటర్ డోర్‌ను పగలగొట్టిన నిందితుడు, 4.03 గంటల సమయంలో అత్యవసర విభాగంలోకి ప్రవేశించాడు. ఆ తరువాత మూడో అంతస్తులో ఉన్న సెమినార్ గదిలోకి వెళ్లాడు. ఆ సమయంలో బాధితురాలు సెమినార్ హాల్‌లో గాఢ నిద్రలో ఉండగా, రాయ్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు' అని పోలీసులు తెలిపారు.
మద్యం తాగి, పోర్న్ వీడియోలు చూసి
ఆగస్టు 8న రాత్రి 11 గంటల సమయంలో ఆర్‌జీకార్ ఆసుపత్రి వెనక వైపునకు వెళ్లి సంజయ్ రాయ్ మద్యం తాగినట్లు పలువురు పేర్కొన్నారు. ఆ సమయంలో పోర్న్ వీడియోలు చూసినట్లు చెప్పారు. మద్యం తాగాక పలుమార్లు ఆసుపత్రి ప్రాంగణంలో చక్కర్లు కొట్టినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఇక బాధితురాలు చనిపోయిన విషయం ఆగస్టు 9 ఉదయం పూట వెలుగులోకి వచ్చింది. సుమారు 10.53 నిమిషాలకు బాధితురాలి తల్లికి ఈ విషయం చేరవేశారు. కానీ తొలుత బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. అనంతరం ఇది హత్యాచారంగా తేలింది. బాధితురాలు చనిపోయిన సెమినార్ హాల్‌లోకి నిందితుడు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తడంతో కేసును సీబీఐకి అప్పగించారు. తొలుత కేసు నమోదు చేసిన ఎస్సై అనుప్ దత్తాపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. ఎస్సైతో కలిసి నిందితుడు దిగిన పలు ఫొటోలను దర్యాప్తు సంస్థ సేకరించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్న వేళ, సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి ఆగస్టు 20న విచారణ చేపట్టింది. ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది. ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ ప్రశ్నలు సంధించింది.