Kerala Man Planted Half A Lakh Mangrove Plants :ప్రకృతి పరిరక్షణే మానవాళి జీవనం సజావుగా సాగడానికి మార్గమని తెలుసుకున్న కేరళ వైపిన్ ప్రాంతంలో ఉండే మురుకేశన్, మడ అడవుల ప్రేమికుడిగా మారిపోయాడు. వందలు, వేలు కాదు సుమారు లక్షన్నరకు పైగా మడ మొక్కలు నాటాడు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి మనుషుల్ని, వన్య ప్రాణుల్ని కాపాడి, సముద్ర తీర జీవవైవిధ్యంలో ముఖ్య భాగంగా ఉంటాయి మడ అడవులు. వీటి ప్రాముఖ్యం గురించి మురుకేశన్‌కు బాగా తెలుసు కాబట్టే ఎవ్వరి కోసం ఎదురుచూడకుండా అడవుల విస్తరణకు ముందుకొచ్చాడు. కేరళలో అతిపెద్ద మడ అడవులకు కేంద్రంగా వైపిన్ను తీర్చి దిద్దటమే తన లక్ష్యంగా భావించిన మురుకేశన్, ఇప్పటికే లక్షకు పైగా మడ మొక్కలను నాటేందుకు సిద్ధం చేశాడు. గతంలో లక్షకుపైగా మొక్కలు నాటాడు.
అయితే ఇదంతా సులువుగా జరగలేదని చెబుతున్నాడు మురుకేశన్. పదేళ్ల క్రితం మడ అడవులను రక్షించడానికి తాను సిద్ధం అయినప్పుడు చాలా మంది తనను పిచ్చోడు అన్నారని, స్థానికులు అడ్డుకోవడం వల్ల మడ మొక్కలు నాటడం ఆగిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయని చెప్పాడు. ఇలా మొక్కలు నాటడం అడ్డుకున్నవాళ్లలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని చెప్పాడు. గత 50 సంవత్సరాల్లో ప్రపంచం మడ అడవుల ప్రాముఖ్యాన్ని గుర్తించింది. సునామీ తర్వాత, మడ అడవుల రక్షణ, ప్రాముఖ్యత గురించి ప్రపంచానికి మరింత అవగాహన వచ్చింది. అయితే, స్థానికులు మాత్రం మడ అడవులను సరిగ్గా అర్థం చేసుకోలేదని మురుకేశన్ వాపోతున్నాడు.
మడ మొక్కలు ఎలా పెంచాలంటే?
మార్చి, ఏప్రిల్‌లో మడ విత్తనాలను సేకరించడం ద్వారా మడ మొక్కలకు సంబంధించిన పని మొదలు అవుతుంది. వీటికోసం మురుకేశన్ స్థానికంగా ఉండే వల్లార్‌పాడు, ముళవుకాడ్, పుదువైప్పిన్, వలంతకాడ్ నుంచి విత్తనాలను సేకరిస్తాడు. తొమ్మిది అంగుళాల వెదురును కోసి, లోపలి భాగాన్ని శుభ్రం చేసి, అందులో వాగు నుంచి సేకరించిన మట్టిని నింపి, గింజలతో కట్టడం ద్వారా మడ మొక్క మొలకెత్తుతుంది. మొక్క తగిన ఎత్తుకు పెరిగిన తర్వాత, ఆ మొక్కను నీటిలో నాటాలి. 2013 నుంచి మురుకేశన్ వైపిన్ మలిపురంలోని తన ఇంటి సమీపంలో మడ నర్సరీని ప్రారంభించాడు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వెనుదిరిగి చూడని మురుకేశన్‌కు అటవీ శాఖ సహాయం అందిస్తోంది. ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న మురుకేశను మడ మొక్కల పెంపకం గురించి అడగటానికి దేశ విదేశాల నుంచి కూడా ఫోన్లు వస్తుంటాయి.