తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కంగనను చెంపదెబ్బ కొట్టిన CISF కానిస్టేబుల్‌- జాబ్​ నుంచి సస్పెండ్ - Kangana Ranaut Incident

Kangana Ranaut Slapped By CISF : బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు చేదు అనుభవం ఎదురైంది. చండీగఢ్‌ విమానాశ్రయంలో సీఐఎస్​ఎఫ్​ మహిళా కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. మరోవైపు, సదరు కానిస్టేబుల్​ను అధికారులు సస్పెండ్ చేశారు.

Kangana Ranaut Slapped By CISF
Kangana Ranaut Slapped By CISF (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jun 6, 2024, 7:36 PM IST

Kangana Ranaut Slapped By CISF :బాలీవుడ్‌ నటి, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన కంగనా రనౌత్‌కు చేదు అనుభవం ఎదురైంది. చండీగఢ్‌ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే సదరు కానిస్టేబుల్​ను సస్పెండ్ చేసినట్లు సీఐఎస్ఎఫ్ సీనియర్ అధికారి తెలిపారు

అసలేం జరిగిందంటే?
గురువారం దిల్లీకి బయలుదేరారు కంగన. అందుకోసం విమానం ఎక్కేందుకు చండీగఢ్‌ విమానాశ్రయానికి వచ్చారు. బోర్డింగ్‌ పాయింట్‌కు చేరుకుంటున్న సమయంలో మహిళా కానిస్టేబుల్ కుల్విందర్‌ కౌర్‌ చెంప దెబ్బ కొట్టారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాల్ని నిరసిస్తూ దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతుల్ని ఉద్దేశించి నటి చేసిన వ్యాఖ్యలే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని తెలుస్తోంది.

'నేను క్షేమంగానే ఉన్నా'
ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా కంగన స్పందించారు. తాను బాగానే ఉన్నట్లు పేర్కొంటూ ఓ వీడియోను విడుదల చేశారు. సెక్యూరిటీ చెకింగ్‌ వద్ద ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. సెక్యూరిటీ చెకింగ్‌ పూర్తయి పాస్‌ కోసం వేచి చూస్తుండగా మహిళా ఆఫీసర్‌ తన వైపు వచ్చి కొట్టినట్లు తెలిపారు. తనను దూషించారని కూడా చెప్పారు. ఎందుకిలా చేశారని అడగ్గా, రైతులకు మద్దతుదారని ఆమె చెప్పినట్లు కంగన వెల్లడించారు. తాను క్షేమంగానే ఉన్నానని కాకపోతే పంజాబ్‌లో ఉగ్రవాదం, హింసను ఎలా ఎదర్కోవాలనే అంశంపైనే ఆందోళనగా ఉందన్నారు.

కానిస్టేబుల్ సస్పెండ్​
మరోవైపు, దిల్లీ చేరుకున్న అనంతరం కంగనా రనౌత్ సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌, ఇతర సీనియర్‌ అధికారుల్ని కలిసి ఎయిర్​పోర్ట్​లో జరిగిన ఘటన గురించి వివరించారు. దీంతో దర్యాప్తు చేసేందుకు బృందాన్ని ఏర్పాటు చేసిన అధికారులు, కుల్విందర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు సీఐఎస్‌ఎఫ్ కార్యాలయానికి తరలించారు. అనంతరం మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సీఐఎస్ఎఫ్ సీనియర్ అధికారి తెలిపారు.

71వేల మెజార్టీతో గెలుపు
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన కంగనా రనౌత్, 71వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ నాయకుడు విక్రమాదిత్య సింగ్‌ను చిత్తుగా ఓడించారు. బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కంగన, రాజకీయాల్లోకి ప్రవేశించిన తక్కువ కాలంలోనే ప్రజలకు మరింత దగ్గరయ్యారు. తొలి విజయం సాధించి పార్లమెంట్​లో అడుగుపెట్టనున్నారు.

ABOUT THE AUTHOR

...view details