Kalki Dham Temple Sambhal Modi :విదేశాలకు తరలి వెళ్లిన పురాతన విగ్రహాలను నేడు భారత దేశం తిరిగి తీసుకువస్తోందని, రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో కల్కి ధామ్ ఆలయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయ నమూనాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, శ్రీ కల్కిధామ్ నిర్మాణ్ ట్రస్ట్ ఛైర్మన్ ఆచార్య ప్రమోద్ కృష్ణం పాల్గొన్నారు.
ఆలయ శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇంతమంది ఆచార్యులు, సాధువుల సమక్షంలో ఈ కల్కిధామ్ క్షేత్రానికి శంకుస్థాపన చేయటం సంతోషంగా ఉందని అన్నారు . కల్కిధామ్ భారతీయ విశ్వాసానికి మరో గొప్ప కేంద్రంగా ఆవిర్భవిస్తుందని తాను విశ్వసిస్తున్నట్టు చెప్పారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని కూడా ప్రస్తావించారు. ఆయన(ఛత్రపతి శివాజీ) పాదాలకు నమస్కరించి నివాళులర్పిస్తున్నట్టు చెప్పారు. ఈ రోజు మరింత పవిత్రమైందని, అందరికీ స్ఫూర్తిదాయకం అవుతుందని మోదీ వాఖ్యానించారు. ఈ కార్యక్రమం అనంతరం రూ.10 లక్షల కోట్ల కంటే విలువైన 14,500 ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
"నేడు ఒకవైపు మన తీర్థక్షేత్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. మరోవైపు నగరాల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు రూపుదిద్దుకుంటున్నాయి. నేడు దేవాలయాల నిర్మాణం జరుగుతోంది. దేశవ్యాప్తంగా కొత్త వైద్య కళాశాలల నిర్మాణం కూడా అవుతోంది. మన ప్రాచీన శిల్పాలను విదేశాల నుంచి తీసుకొస్తున్నాము. రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు కూడా వస్తున్నాయి."
- నరేంద్ర మోదీ , ప్రధాన మంత్రి