Kaante Wale Baba in Maha kumbh :ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాలో పాల్గొనేందుకు కోట్లాది మంది తరలివస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు సాధారణ ప్రజలతోపాటు సాధువులు, బాబాలు, సన్యాసులు, విదేశీ పర్యటకులు పోటెత్తుతున్నారు. వీరిలో కొంత మంది బాబాలు తమ ప్రత్యేకతతో ప్రజల దృష్టిని ఆకట్టుకుంటున్నారు. వాళ్లలో ఒకరు ఈ కాంటే వాలే బాబా. ముళ్ల పొదపై పడుకుని ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిన ఆయన, భక్తులను ఆశ్చర్యపరుస్తున్నారు.
కాంటే వాలే బాబాగా పిలిపించుకుంటున్న రమేశ్ కుమార్ మాంఝీ గత 50 సంవత్సరాలుగా ఇలా ముళ్లపై పడుకుని కుంభమేళాకు వస్తున్నానని తెలిపారు. 'నేను గురువుకు సేవ చేస్తాను. ఆయనే మాకు జ్ఞానాన్ని అందించారు. అది మాకు బలాన్ని ఇవ్వడమే కాకుండా సహాయం చేస్తుంది. ఇదంతా ఆ భగవంతుడి మహిమే. నేను ఇలా ముళ్లపై పడుకుని ప్రతి కుంభమేళాకు వస్తాను. ఇది నా శరీరానికి మేలు చేస్తుంది. ఇలా చేయడం నాకు ఎప్పుడూ బాధ కలగలేదు. నాకు వచ్చే దక్షిణలో సగం దానం చేసి, మిగిలిన మొత్తాన్ని నా ఖర్చులకు ఉపయోగిస్తా' అని కాంటే వాలే బాబా తెలిపారు.
కుంభమేళాలో 'ఐఐటీ బాబా'
మరోవైపు, ఉన్నత చదువులు చదివి ఆధ్యాత్మికం వైపు వచ్చిన మరో సాధువు 'ఐఐటీ బాబా'గా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఆ ఐఐటీ బాబా పేరు అభేయ్ సింగ్. స్వస్థలం హరియాణా. ఐఐటీ-బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేసినట్లు ఆయన అంటున్నారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లోనే ఉద్యోగం కొంతకాలం కార్పొరేట్‌లో పనిచేసిన ఆయన దాన్ని వదులుకొన్నారని తెలిపారు. ఫొటోగ్రఫీపై మక్కువతో అటువైపు దృష్టి సారించారని, ఈ క్రమంలోనే ఆధ్యాత్మికం వైపు అడుగులు వేసినట్లు చెప్పారు. తాజాగా మహా కుంభమేళాకు వచ్చిన ఆయన ఓ వార్తా ఛానెల్ ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. ఐఐటీ బాబా, ఇంజినీర్ బాబాగా నెటిజన్లు ఆయన్ను పేర్కొంటున్నారు. సైన్స్ ద్వారా ఆధ్యాత్మికతను మరింత ఆస్వాదిస్తున్నట్లు చెప్పడం విశేషం.