K Surendran Criminal Cases :కేరళలోని వయనాడ్‌లో రాహుల్‌గాంధీపై పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి కె.సురేంద్రన్‌పై 243 కేసులు ఉన్నాయి. దీంతో కేరళలోనే అత్యధిక క్రిమినల్ కేసులు కలిగిన అభ్యర్థిగా ఆయన నిలిచారు. ఈ కేసుల్లో అత్యధికంగా చట్టవిరుద్ధంగా సమావేశాలు నిర్వహించడం, అల్లర్లు, అధికారులను అడ్డుకోవడం వంటివి ఉన్నాయి. ప్రజా ఆస్తుల విధ్వంసం, నిబంధనలు అతిక్రమించడం, హత్యాయత్నం వంటి కేసులు కూడా సురేంద్రన్‌పై నమోదయ్యాయి.
వీటిలో ఎక్కువ కేసులు 2018, 2019లోనే నమోదయ్యాయి. అప్పట్లో వివాదాస్పదమైన శబరిమల ఆందోళనల్లోనూ సురేంద్రన్‌పై కేసులు నమోదయ్యాయి. 2004 లోక్‌సభ ఎన్నికల్లో కె సురేంద్రన్‌పై మూడు కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుల్లో ఒక్కదాంట్లోనూ సురేంద్రన్‌కు శిక్ష పడలేదు. ఈ మేరకు బుధవారం సురేంద్రన్ నామినేషన్ వేయగా, అఫిడవిట్ ద్వారా ఈ కేసుల వివరాలు బయటకు వచ్చాయి.
సురేంద్రన్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, ఆయన ఆదాయం 2022-23 సంవత్సరానికి గాను రూ. 2,26,800గా ఉంది. ఆయన వద్ద రూ.15 వేలు నగదు, సురేంద్రన్ భార్య దగ్గర రూ.10 వేల నగదు ఉంది. సురేంద్రన్ బ్యాంకు డిపాజిట్లు మొత్తం రూ.66,455. సురేంద్రన్ వద్ద 10 షేర్లు ఉన్నాయి. ఆయన LIC పాలసీ విలువ రూ.3,25,000. ఆయన వద్ద 8 గ్రాముల బంగారం ఉండగా, సురేంద్రన్ భార్యకు 32 గ్రాముల బంగారు ఉంది. వారి మొత్తం భూమి ఆస్తి అంచనా విలువ రూ. 21,75,000.