Bengal Doctors Fast :కోల్‌కతా ఆర్‌జీ కర్ హత్యాచార ఘటన వ్యవహారంలో జూనియర్ వైద్యులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. బంగాల్ ప్రభుత్వ వైఖరికి నిరసనలు ఉద్ధృతం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చర్చల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని- అందుకే, తమ డిమాండ్లు నెరవేర్చే వరకు దీక్ష కొనసాగిస్తామని ప్రకటించారు. పారదర్శకత కోసం నిరాహార దీక్ష చేస్తున్న వేదిక వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని ఓ జూనియర్ వైద్యుడు వెల్లడించారు.
డాక్టర్ల డిమాండ్లపై దీదీ సర్కార్ నో రెస్పాన్స్! ఆమరణ నిరాహార దీక్షకు దిగిన జూనియర్ వైద్యులు - bengal doctors fast
Bengal Doctors Fast : బంగాల్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన జూనియర్ డాక్టర్లు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వైద్యుల మండిపాటు.
Published : Oct 6, 2024, 7:12 AM IST
'ఆహారం తీసుకోకుండా విధులు నిర్వర్తిస్తాం'
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని వైద్య విద్యార్థులు విస్తృతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేయడం వల్ల ప్రభుత్వంతో చర్చలు జరిపారు. డిమాండ్ల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. 42 రోజులు కొనసాగించిన నిరసనలు విరమించి గతనెల 21న పాక్షికంగా విధుల్లో చేరారు. అయితే, తమ భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల వైఖరి కనిపించడం లేదని ఆరోపిస్తూ ఇటీవల మరోసారి ఆందోళనలు చేపట్టారు వైద్యులు. తమ డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వానికి 24 గంటల గడువు విధిస్తూ శుక్రవారం సాయంత్రం ధర్నా ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోయిందని, అందుకే డిమాండ్లు నెరవేరే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆరుగురు నిరాహార దీక్ష చేస్తారని చెప్పారు. మిగతావారు విధుల్లో చేరినప్పటికీ ఎలాంటి ఆహారం తీసుకోరని తెలిపారు.
హత్యాచారానికి గురైన వైద్య విద్యార్థికి న్యాయం చేయాలని వైద్యులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు ఆరోగ్య కార్యదర్శి ఎన్‌ఎస్ నిగమ్‌ను విధుల నుంచి తొలగించడం, రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల్లో భద్రతా చర్యలు తీసుకోవడం, ఆసుపత్రుల్లో పోలీసుల రక్షణ పెంపు, శాశ్వత మహిళా పోలీసు సిబ్బంది నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.