Hemant Soren Reclaim Jharkhand :ఝార్ఖండ్‌లో ఘన విజయం సాధించిన ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కూటమి నవంబర్ 28న ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ ఆదివారం సాయంత్రం 4 గంటలకు రాజభవన్‌కు వెళ్లారు. సంప్రదాయం ప్రకారం, గవర్నర్ సంతోష్ గంగ్వార్‌ను కలిసి, తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరేన్ అధ్యక్షతన ఆదివారం భేటీ అయిన ఇండియా కూటమి నేతలు ఆయనను శాసనసభా పక్షనేతగా ఎన్నుకున్నారు. తర్వాత ముఖ్యమంత్రి పదవికి హేమంత్ రాజీనామా చేశారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ సంతోష్ గంగ్వార్‌ను కలిసి భాగస్వామ్య పక్షాల మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరగా, అందుకు గవర్నర్ అంగీకరించారు. 28న ప్రమాణస్వీకారం చేసేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని హేమంత్‌ను గవర్నర్ కోరారు.
"ఝార్ఖండ్‌లో జేఎంఎం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించాం. ఈ క్రమంలోనే గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశాం. నేను కూడా నా రాజీనామాను సమర్పించాను. నాతో పాటు కాంగ్రెస్, ఆర్జేడీ ఇన్ఛార్జ్ కూడా ఇక్కడే ఉన్నారు. నవంబర్ 28న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది."
- హేమంత్ సోరెన్, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు
భారీ విజయం
నవంబర్ 13, 20 తేదీల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించింది. 81 స్థానాలున్న ఝార్ఖండ్ అసెంబ్లీకి ప్రభుత్వ ఏర్పాటుకు 41 సీట్లు అవసరం కాగా జేఎంఎం 34 చోట్ల గెలుపొందింది. కూటమిలోని మిత్రపక్షాలైన కాంగ్రెస్ 16 , ఆర్జేడీ 4, సీపీఐ ఎంఎల్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. ఎన్డీయే కూటమి 24 స్థానాలకే పరిమితమైంది. ఫలితంగా 56 శాసనసభ్యుల బలంతో జేఎంఎం కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.
ఎగ్జిట్ పోల్స్ తలకిందులు
ఆదివాసీ కోటలో జేఎంఎం మరోసారి తన పట్టును నిలుపుకుంది. ఝార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి విజయంలో సీఎం హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పనా సోరెన్ కీలక పాత్ర పోషించారు. ఈడీ కేసులు మొదలు అరెస్టులు, తిరుగుబాట్లు, ప్రత్యర్థుల వ్యూహాలు ఇలా అనేక సవాళ్లను ఎదుర్కొన్న జేఎంఎం - ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఘన విజయాన్ని సాధించింది. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి రాజకీయ అస్థిరతకు మారుపేరుగా నిలిచిన ఝార్ఖండ్‌లో, ఈసారి స్పష్టమైన మెజార్టీ సాధించిన జేఎంఎం సుస్థిర పాలన దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది.