తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రశాంతంగా ఝార్ఖండ్ తొలి విడత ఎన్నికలు

Elections 2024
Elections 2024 (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2024, 7:01 AM IST

Updated : Nov 13, 2024, 6:45 PM IST

Jharkhand Assembly Election 2024 :ఝార్ఖండ్‌లో తొలి విడతతోపాటు 31 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. 33 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను ఎన్నికల సంఘం ప్రకటించగా, సిక్కింలోని 2 నియోజకవర్గాలను సిక్కిం క్రాంతికారీ మోర్చా ఏకగ్రీవంగా గెలుచుకుంది. దీంతో బుధవారం 31 చోట్ల పోలింగ్‌ జరుగుతోంది. కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి బుధవారమే పోలింగ్‌ జరుగుతోంది.

LIVE FEED

5:06 PM, 13 Nov 2024 (IST)

ఝార్ఖండ్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. 43 నియోజక వర్గాల్లో 683 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. సాయంత్రం 5 గంటలకు వరకు 64.86 శాతం ఓటింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఝార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్, ఒడిశా గవర్నర్‌ రఘుబర్ దాస్, టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ తదితర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

బరిలో ఉన్న ప్రముఖులు వీరే!
ఝార్ఖండ్‌లో మొదటి విడత పోలింగ్ ముగిసింది. ఝార్ఖండ్‌ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు ఉండగా తొలివిడతలో భాగంగా 43 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 950 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియగా, మిగిలిన చోట్ల 5 గంటలకు ఓటింగ్ ముగిసింది. తొలి విడతలో 683 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. పోలింగ్ కోసం 15,344 కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. తొలి విడత బరిలో ఉన్న అభ్యర్థుల్లో మాజీ సీఎం చంపయీ సోరెన్, కాంగ్రెస్ నేత బన్నా గుప్తా, మాజీ సీఎం మధు కోడా సతీమణి గీతా కోడా ఉన్నారు.

ధోనీని చూసేందుకు ఎగబడిన జనం
మొదటి విడత పోలింగ్‌లో భాగంగా పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఝార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగవార్ రాంచీలోని ఏటీఐ కేంద్రంలో ఓటు వేశారు. ఝార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్ ఆయన సతీమణి కల్పనా సోరెన్ రాంచీలో ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమని ఓటు వేసిన అనంతరం సోరెన్ పేర్కొన్నారు. ఒడిశా గవర్నర్, ఝార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్ దాస్ కుటుంబ సభ్యులతో కలిసి జంషెడ్‌పూర్‌లో ఓటు వేశారు. కోడెర్మాలోని పోలింగ్ స్టేషన్‌లో కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవి ఓటు వేశారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అర్జున్ ముండా, ఆయన భార్య మీరా సరాయ్ కెలాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆయన సతీమణి సాక్షి రాంచీలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ధోనీకి చూసేందుకు భారీగా అభిమానులు పోలింగ్ స్టేషన్‌ వద్దకు వచ్చారు.

రెండో విడత పోలింగ్ ఎప్పుడంటే?
81 అసెంబ్లీ స్థానాలున్న ఝార్ఖండ్‌లో ఈ నెల 20న రెండో విడతలో పోలింగ్ జరగనుంది. మొత్తం 38 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 23న చేపట్టనున్నారు. గత ఎన్నికల్లో జేఎంఎం 30 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్‌, ఆర్జేడీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీకి 25సీట్లు వచ్చాయి.

వయనాడ్​లో 60.79 శాతం పోలింగ్​
దేశమంతా ఎంతో ఆసక్తిగా చూసిన కేరళలోని వయోనాడ్​ ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు ​60.79 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు ఎలక్షన్ కమిషన్​ వెల్లడించింది. ఈ వయనాడ్​ లోక్​సభ స్థానం నుంచి యూడీఎఫ్​ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. ఇంతకు ముందు ఇక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరుసగా రెండు సార్లు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రాయ్​ బరేలీ స్థానాన్ని ఉంచుకుని, వయనాడ్ స్థానానికి ఆయన రాజీనామా చేసిన నేపథ్యంలో ఇక్కడ ఉపఎన్నిక వచ్చింది. ఇప్పుడు తన సోదరుని స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేశారు.

4:34 PM, 13 Nov 2024 (IST)

ఝార్ఖండ్​ తొలి దశ ఎన్నికల్లో 950 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది. పోలింగ్ సమయం ముగిసే సమయానికి క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. మిగిలిన కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది.

3:51 PM, 13 Nov 2024 (IST)

  • ఝార్ఖండ్‌లో కొనసాగుతున్న తొలి విడత పోలింగ్‌
  • మధ్యాహ్నం 3 గంటల వరకు 59.28 శాతం పోలింగ్‌ నమోదు
  • సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్‌
  • సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 వరకు పోలింగ్‌

2:19 PM, 13 Nov 2024 (IST)

  • ఝార్ఖండ్​లో కొనసాగుతున్న తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌
  • మధ్యాహ్నం 1 గంట వరకు 46.25 శాతం పోలింగ్‌ నమోదు

12:06 PM, 13 Nov 2024 (IST)

రాంచీ పోలింగ్ కేంద్రంలో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పన సోరెన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బర్హైత్ స్థానం నుంచి హేమంత్ సోరెన్, గాండే నియోజకవర్గం నుంచి కల్పన పోటీ చేస్తున్నారు. ఆ రెండు స్థానాలకు రెండో దశలో పోలింగ్ జరగనుంది.

11:40 AM, 13 Nov 2024 (IST)

  • ఝార్ఖండ్​లో కొనసాగుతున్న తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌
  • ఉదయం 11 గంటల వరకు 29.31 శాతం పోలింగ్‌ నమోదు

10:37 AM, 13 Nov 2024 (IST)

మధ్యప్రదేశ్​లో జరగుతున్న అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

10:12 AM, 13 Nov 2024 (IST)

  • రాంచీలో పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన ఝార్ఖండ్ గవర్నర్ సంతోష్​ కుమార్ గంగ్వార్
  • ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి

10:00 AM, 13 Nov 2024 (IST)

ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని బలోపేతం చేయడానికి ప్రజలు తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారికి అభినందనలు తెలిపారు. వయనాడ్ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ అన్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశమని, దానిని ఉపయోగించుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని వయనాడ్ ఓటర్లకు పిలుపునిచ్చారు.

9:52 AM, 13 Nov 2024 (IST)

  • ఝార్ఖండ్​లో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌
  • ఉదయం 9 గంటల వరకు 13.04 శాతం పోలింగ్‌ నమోదు

8:57 AM, 13 Nov 2024 (IST)

రాష్ట్రంలో అవినీతి, చొరబాట్లు, బుజ్జగింపులను అంతమొందించేందుకు తమ ఓటు హక్కును రికార్డు స్థాయిలో వినియోగించుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఝార్ఖండ్​ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

8:04 AM, 13 Nov 2024 (IST)

ప్రజాస్వామ్య పండుగలో పూర్తి ఉత్సాహంతో ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ఎన్నికల్లో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మోదీ కోరారు. మొదటి సారి ఓటు వేయబోతున్న యువతీయువకులకు హృదయపూర్వక అభినందనలు చెబుతున్నట్లు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో నవంబర్ 20న రెండో దశ ఎన్నికలు జరగనుండగా, ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగనుంది.

Last Updated : Nov 13, 2024, 6:45 PM IST

ABOUT THE AUTHOR

...view details