Maharashtra Assembly Election 2024 : మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను మించి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. 288 స్థానాలకుగాను అధికార కూటమి 233 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ 51 స్థానాలతో సరిపెట్టుకుంది. అభివృద్ధికే మహారాష్ట్ర ఓటర్లు పట్టంకట్టారని ముఖ్యమంత్రి శిందే, ఉపముఖ్యమంత్రులు ఫడణవిస్, అజిత్ పవార్ స్పష్టం చేశారు.
మహాయుతి ఘన విజయంమహారాష్ట్ర ఓటర్లు బీజేపీ కూటమికే పట్టం కట్టారు. మరాఠా కురువృద్ధుడు శరద్ పవార్ రాజనీతి, కాంగ్రెస్ సీనియర్ల ప్రణాళికలు, ఉద్ధవ్ ఠాక్రే వ్యూహాలు ఏవీ మహాయుతి ముందు నిలవలేకపోయాయి. కమలదళం నేతృత్వంలోని అధికార మహాయుతి ఏకపక్ష విజయం సాధించింది. 288 స్థానాల మహారాష్ట్ర అసెంబ్లీలో 233 స్థానాల్లో మహాయుతి పక్షాలు విజయం సాధించాయి. మొత్తంగా మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 132 స్థానాల్లో జయభేరి మోగించగా, శిందే నేతృత్వంలోని శివసేన 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 స్థానాల్లో గెలిచాయి. మహాయుతి కూటమి పక్షాలైన జేఎస్ఎస్ 2, ఆర్‌ఎస్‌పీఎస్ ఒక స్థానంలో, ఆర్ఎస్వీఏ ఒక స్థానంలో విజయం సాధించాయి.
హ్యాట్రిక్ విక్టరీ
మహారాష్ట్ర ఎన్నికలు బీజేపీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించాయి. అంతేకాదు గతంలో ఉన్న అన్ని రికార్డులను చెరిపేశాయి. గత 50 ఏళ్లలో ఒక పార్టీకి లేదా ఎన్నికల ముందు ఏర్పడిన కూటమికి ఇదే అతిపెద్ద విజయం కావడం గమనార్హం. వరుసగా మూడు పర్యాయాలు భాజపాకు అధికారాన్ని అందించిన ఆరో రాష్ట్రం మహారాష్ట్ర నిలిచింది.
చతికిల పడిన మహా వికాస్ అఘాడీ
ప్రతిపక్ష మహావికాస్ అఘాఢీ (ఎంవీఏ) నామమాత్రంగానే ప్రభావం చూపింది. ఎంవీఏ 51 స్థానాల్లో గెలిచింది. ఎంవీఏలో శివసేన యూబీటీ 20, కాంగ్రెస్ 16, ఎన్సీపీ శరత్‌చంద్ర పవార్ పార్టీ 10 చోట్ల విజయం సాధించాయి. ఎంవీఏ కూటమిలోని పార్టీలైన సమాజ్‌వాదీ పార్టీ రెండు చోట్ల, సీపీఎం ఒక చోట, పీడబ్ల్యూపీఐ ఒక చోట గెలిచాయి. ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు.
చక్రం తిప్పిన ఫడణవీస్
ఫడణవీస్ జయభేరిమహారాష్ట్ర ఎన్నికల్లో పలువురు ప్రముఖులు విజయం సాధించారు. కోప్రి-పచ్‌పఖడీ స్థానంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే సుమారు 1,20,000 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. బారామతిలో ఎన్‌సీపీ అభ్యర్థి, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ దాదాపు 99,000 ఓట్ల తేడాతో గెలిచారు. నాగ్‌పుర్ నైరుతి స్థానంలో బీజేపీ అభ్యర్థి, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ జయభేరి మోగించారు. ఇస్లాంపూర్‌లో ఎన్సీపీ ఎస్పీ అభ్యర్థి జయంత్ పాటిల్ 13,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వర్లీలో శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే 8,800 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
మహారాష్ట్ర ఎన్నికలుమహారాష్ట్రలో నవంబర్ 20న మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 66.05 శాతం పోలింగ్ నమోదైంది. నాందేడ్ లోక్‌సభ స్థానం ఉపఎన్నికలో 67.81 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలో బీజేపీ 149, శివసేన శిందే పార్టీ 81, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 59 స్థానాల్లో పోటీ చేశాయి. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ-ఎంవీఏ కూటమిలోని కాంగ్రెస్ 101, శివసేన-యూబీటీ 95, ఎన్సీపీ-ఎస్పీ 86 స్థానాల్లో పోటీ చేశాయి. రాజ్‌ఠాక్రే పార్టీ ఎంఎన్ఎస్, ప్రకాశ్ అంబేద్కర్ స్థాపించిన 'వంచిత్ బహుజన్ అఘాడీ' వంటి పార్టీలు పోటీ చేసినప్పటికీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి.