Jhansi Medical College Fire Accident :ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లా మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలోని పిల్లల వార్డులో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగి 10మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు. 16మంది గాయపడ్డారు. మృతుల్లో రోజుల వయస్సున్న నవజాత శిశువులు ఉన్నారు. ఘటనా సమయంలో నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్-NICUలో మొత్తం 54 మంది పిల్లలు అడ్మిట్ అయి ఉన్నారు.
ఆస్పత్రి NICU విభాగంలో శుక్రవారం రాత్రి 10.45 గంటలకు ఆక్సీజన్ కాన్సన్‌ట్రేటర్‌లో విద్యుత్ షాట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. పిల్లల వార్డు గదుల్లో ఆక్సీజన్ పూర్తిగా వ్యాపించి ఉండటం వల్ల మంటలు భారీగా విస్తరించాయని ఆస్పత్రి సూపరిండెంట్ సచిన్‌మహోర్ తెలిపారు. మంటల ధాటికి వార్డులోని పిల్లల బెడ్లు, ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. అటు చిన్నారుల మృతితో ఆస్పత్రి ప్రాంగణంలో కన్నవారి రోదనలు మిన్నంటాయి.
'12 గంటల్లో నివేదిక ఇవ్వండి'
సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపకదళం చర్యలు చేపట్టింది. ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని UP సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ప్రమాదంపై 12 గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఝాన్సీ డివిజనల్ కమీషనర్ పోలీస్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌ను ఆదేశించారు.
రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
మహారాణి లక్ష్మీబాయి వైద్య కళాశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో నవజాత శిశువుల మరణ వార్త బాధాకరమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. గాయపడిన చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ వేదికగా రాష్ట్రపతి సంతాపం ప్రకటించారు. హృదయవిదారక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పిల్లల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటనను భరించే శక్తిని మృతుల కుటుంబాలకు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డ చిన్నారులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మరోవైపు ఆస్పత్రి ఘటనలో శిశువుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడ్డ చిన్నారులకు రూ.50 వేల పరిహారాన్ని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.
'ఇప్పుడేం చెప్పలేం'
ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, ఆరోగ్య మంత్రి అర్ధరాత్రి ఝాన్సీకి చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత దీనిపై ఓ క్లారిటీ వస్తుందని తెలిపారు. "శనజాత శిశువులు మరణం చాలా దురదృష్టకరం. ఈ ఘటనపై మొదటి దర్యాప్తు ఆరోగ్య శాఖ చేపడుతుంది. రెండో విచారణ పోలీసులు చేస్తారు. అగ్నిమాపక విభాగం కూడా అందులో భాగం అవుతుంది. అంతేకాకుండా మేజిస్ట్రేట్ స్థాయి విచారణ కూడా ఆదేశించాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవ్వరినీ వదిలిపెట్టం. కుటుంబ సభ్యులతో పాటు మేము చిన్నారుల మృతదేహాలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము. ఇప్పటివరకు ఏడుగురి చిన్నారుల మృతదేహాలను గుర్తించాం. మరో మూడు మృతదేహాలను గుర్తించలేదు. నవజాత శిశువులను కోల్పోయిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటాం. ఫిబ్రవరిలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరిగింది. జూన్‌లో మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. అయితే ఈ దుర్ఘటన ఎలా జరిగిందో అనే విషయం విచారణ నివేదిక వచ్చిన తర్వాతే చెప్పగలం." అని పాఠక్ తెలిపారు.