JEE Advanced Topper Interview 2024 :'జీవితంలో సాధ్యం కానిది ఏదీ లేదు. దృఢ సంకల్పంతో ఉంటే అన్నీ సాధ్యమే. జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి. అది పెద్దదిగా ఉండాలి' ఇవేవో పెద్దపెద్ద వ్యక్తులు చెప్పిన మాటలు కావు. జేఈఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇండియా టాపర్ వేద్ లహోటి చేసిన వ్యాఖ్యలు. కష్టపడి పనిచేస్తే జీవితంలో సాధ్యం కానిది ఏదీ లేదని వేద్ లహోటి తెలిపాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచిన వేద్ లహోటి ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
చిన్నప్పటి నుంచి చదువులో టాపర్
వేద్ తండ్రి యోగేశ్ లహోటి రిలయన్స్ జియోలో కన్స్ట్రక్షన్ మేనేజర్ కాగా, తల్లి జయ గృహిణి. వేద్ తాతయ్య ఆర్సీ సోమాని రిటైర్డ్ ఇంజినీర్. 8వ తరగతిలో ఇంటర్నేషనల్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు వేద్. అలాగే పదో తరగతిలో 98.6 శాతం, 12వ తరగతిలో 97.6 శాతం మార్కులను సాధించాడు. జూన్ 9న విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్షలో 360 మార్కులకు 355 సాధించాడు వేద్. అంటే 98.61శాతం మార్కులన్నమాట. అలాగే జేఈఈ మెయిన్స్ 2024లో 300 మార్కులకు 295 మార్కులు సాధించి, ఆల్ ఇండియా స్థాయిలో 119వ ర్యాంకు పొందాడు. స్కూల్లో చదివినప్పుడు ఏదైనా సబ్జెక్టులో మార్కులు తగ్గితే తన తాతతో కలిసి పాఠశాలకు వెళ్లేవాడినని వేద్ తెలిపాడు. తనకు మార్కులు ఎందుకు తగ్గాయని టీచర్లను ప్రశ్నించేవాడినని చెప్పాడు.
"జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. నాకు ఉపాధ్యాయులు, కుటుంబసభ్యులు అండగా నిలిచారు. జేఈఈ మెయిన్స్‌లో పోటీ ఎక్కువగా ఉంది. ఒక ప్రశ్నకు తప్పు సమాధానం పెట్టడం వల్ల ఆల్ ఇండియా స్థాయిలో మంచి ర్యాంకు రాలేదు. అందుకే జేఈఈ అడ్వాన్స్డ్ కోసం చాలా కష్టపడ్డాను. చివరకు మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను. దేశం నలుమూలల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులు రాజస్థాన్‌లోని కోటాకు వచ్చి జేఈఈకి ప్రిపేర్ అవుతారు. ఇక్కడ చదువుకోవడానికి ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఉంది. ఐఐటీ బాంబేలో బీటెక్(సీఎస్ఈ)లో సీటు పొందడమే నా లక్ష్యం. భవిష్యత్తులో దేశానికి ఏదైనా చేయాలని ఉంది. భారత్‌లోనే ఉద్యోగం చేస్తాను. కంప్యూటర్ సైన్స్ రంగంలో పరిశోధనలకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రజాదరణ పొందింది. అందుకే దానిపై పరిశోధనలు చేయాలనుకుంటున్నా. నేను నా గురువుల మాట వింటాను. వారు చూపిన మార్గంలో నడుస్తాను. జీవితంలో ఏదైనా సాధించాలంటే చాలా కష్టపడాలి. హార్డ్ వర్క్ చేయాలి. శ్రమపై నమ్మకం ఉంచాలి"
-- ఈటీవీ భారత్‌తో జేఈఈ ఆల్ ఇండియా టాపర్ వేద్ లహోటి