Prashant Kishor Party Launch : రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పొలిటికల్ పార్టీని ప్రారంభించారు. బిహార్ పట్నాలోని వెటర్నరీ కాలేజీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఆయన తన పార్టీ జన్ సురాజ్‌ను అధికారికంగా ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర ప్రసాద్ యాదవ్, మాజీ దౌత్యవేత్త పవన్ వర్మ, మాజీ ఎంపీ హస్సన్ సమక్షంలో ప్రారంభించిన ప్రశాంత్, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి మనోజ్ భారతిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. విద్య, ఉపాధి అవకాశాల ప్రాధాన్యాల గురించి బిహారీలకు వివరించి ఓట్లు అడుగుతామని ప్రశాంత్ కిశోర్ తెలిపారు.
'ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థగా మారుస్తా'
జన్ సురాజ్ పార్టీ అధికారంలోకి వస్తే బిహార్‌లో మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తామని పీకే ప్రకటించారు. బిహార్‌ను ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు రానున్న పదేళ్లల్లో రూ.5 లక్షల కోట్లు అవసరమని చెప్పారు. ఈ మద్యపాన నిషేధం ఎత్తివేయడం ద్వారా వచ్చిన సొమ్మును బడ్జెట్‌కు, నేతల భద్రత, రోడ్లు, నీళ్లు, విద్యుత్‌కు మళ్లించమని తెలిపారు. బిహార్ విద్యా వ్యవస్థ నిర్మాణానికి మాత్రమే ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. మద్యపాన నిషేధం వల్ల ఏటా రూ.20 వేల కోట్ల ఖజానాకు నష్టం వాటిల్లుతోందని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే గంటలో మద్యపానంపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తామని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. ప్రత్యేక హోదాపై నినాదాలు సరిపోవని జేడీయూను ఉద్దేశించి అన్నారు.
#WATCH | Patna, Bihar | Jan Suraaj founder Prashant Kishor officially launched his political party - Jan Suraaj Party.
— ANI (@ANI) October 2, 2024
He says, " if bihar has to have a world-class education system, rs 5 lakh crore is needed in the next 10 years. when the liquor ban will be removed, that money… pic.twitter.com/w8Og4Cn2NX
ఆ సంప్రదాయం అంతం కావాలి
గత 30 ఏళ్లుగా బిహార్ ప్రజలు ఆర్జేడీ లేదా జేడీయూ లేదా బీజేపీకి మాత్రమే ఓటు వేస్తున్నారని ప్రశాంత్ కిశోర్ అన్నారు. ప్రస్తుతం ఈ సంప్రదాయం అంతం కావాలని పేర్కొన్నారు. తమ పార్టీ రాజవంశానికి చెందినది కాదని అన్నారు. జన్ సురాజ్ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించినట్లు వెల్లడించారు. బీజేపీతో కలిసి తమ పార్టీ పనిచేస్తుందంటూ కొన్ని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
రెండేళ్ల క్రితం బిహార్‌లో 'జన్ సురాజ్' యాత్రను ప్రశాంత్ కిశోర్ ప్రారంభించారు. 1917లో మహాత్మాగాంధీ మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన చంపారణ్ జిల్లా నుంచే 3,000 కి.మీ పాదయాత్రను చేపట్టారు. సరిగ్గా పాదయాత్రను ప్రారంభించిన రెండేళ్ల తర్వాత పార్టీని ఇప్పుడు ప్రారంభించారు.