Telangana Private Inter Colleges Move to Cities : రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ జిల్లాల్లోని ప్రైవేట్ జూనియర్ కళాశాలకు గడ్డు కాలం నడుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కళాశాలల్లో విద్యార్థులు ఎవరూ చేరకుండా నగరాల్లోని ప్రైవేటు విద్యాసంస్థల వెంటపడుతున్నారు. దీంతో గ్రామీణ జిల్లాల్లోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలను నగరాలకు తరలించేందుకు వాటి యాజమానులు ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇలా ఇప్పటికే 320కి పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. తాజాగా 12 కళాశాలకు అనుమతి లభించింది. కానీ అవి పలుకుబడి ఉన్నవారి అర్జీలకే అనుమతలు వస్తున్నాయని కొందరు దరఖాస్తుదారులు వాపోతున్నారు.
ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు గ్రామీణ ప్రాంతాలకు వెళుతున్నాయి. దీంతో ప్రైవేట్ కళాశాలల మనుగడ కష్టంగా మారింది. మరి వారు ప్రత్యామ్నాయంగా నగరబాట పడుతున్నారు. ఎందుకంటే గ్రామీణ జిల్లాల్లో కంటే నగరాల్లోనే ప్రైవేటు కళాశాలలకు ఎక్కువ ఆదరణ పెరిగింది. కానీ అలా వెళ్లాలంటే అనుమతులు తప్పనిసరి. ఒక మండలంలోని ప్రైవేట్ కళాశాలలను అదే మండలంలో మరో ప్రాంతానికి తరలించాలంటే ఇంటర్ బోర్డు అనుమతి తప్పనిసరి. అదేగానీ ఒక మండలం నుంచి మరో మండలానికి, ఒక జిల్లా నుంచి మరో జిల్లాకైతే ప్రభుత్వమే అనుమతిస్తూ ఉత్తర్వులు ఇస్తుంది.
అయితే రాష్ట్రవ్యాప్తంగా 425 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా, వీటికి తోడు 495 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో 280 చోట్ల ఇంటర్ వరకు ఉంది. ఇంకా 194 మోడల్ స్కూళ్లలోనూ ఇంటర్ వరకు తరగతులు కొనసాగుతున్నాయి. ఇవే కాకుండా 35 జనరల్ గురుకాలతో పాటు వివిధ సంక్షేమ మంత్రిత్వ శాఖల పరిధిలో వందల సంఖ్యలో ఇంటర్ కాలేజీలు నడుస్తున్నాయి. ఫలితంగా ప్రైవేట్ కళాశాలల్లో ప్రవేశాలు కష్టంగా మారుతున్నాయి. ఏమాత్రం ఆర్థిక స్తోమత ఉన్నా తల్లిదండ్రులు వారి పిల్లలను ఇంటర్ చదవడానికి వారి పిల్లలను నగరాలకే పంపిస్తున్నారు.
అక్కడే రెసిడెన్షియల్ కళాశాలల్లో చదివిస్తూ ఇలా ఒకప్పుడు 2,000 వరకు ఉన్న ప్రైవేట్ జూనియర్ కళాశాలు ఉండేవి. కానీ ఇప్పుడు 1,500లకు తగ్గాయి. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఇంటర్ బోర్డు 1,151 కాలేజీలకు అనుమతిచ్చారు. వాటిల్లో 561 కళాశాలలు కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే ఉన్నాయి. మరో 350 కాలేజీలు మిక్స్డ్ ఆక్యుపెన్సీ పరిధిలో ఉన్నాయి.
పలుకుబడి ఉన్న వాటికే అనుమతులు : గత 12 ఏళ్లుగా కొత్త ప్రైవేట్ జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. ఉన్నవాటినే కొత్తవారు కొనుగోలు చేస్తూ నడిపిస్తూ, కొందరు వాటిని డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వాటిల్లో పలుకుబడి ప్రకారం కొన్నింటికే అనుమతులు లభిస్తున్నాయి. 2022 ఆగస్టులో అప్పటి సర్కారు అనుమతివ్వగా, ఈ సెప్టెంబరు 30న 12 కళాశాలకు ప్రస్తుత ప్రభుత్వం అనుమతిచ్చింది. వాటిలో రెండు కార్పొరేట్ సంస్థలకు చెందిన 8 కళాశాలలు ఉన్నాయి. వీటికి మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వరంగల్ జిల్లాల నుంచి హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు తరలించే అనుమతులు దక్కాయి.