Tirumala Darshan Booking Through Whatsapp : ఎమ్మెల్యే మొదలు ముఖ్యమంత్రి పేషీ వరకూ రోజూ తిరుమల శ్రీవారి దర్శనం కోసం సిఫార్సు లేఖల ఒత్తిడి ఎక్కువగా ఉంటుండటంతో ఎలాంటి సిఫార్సులతో పనిలేకుండా సామాన్యులు సులభంగా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునేలా ముందస్తు బుకింగ్ విధానాన్ని తీసుకురావాలని ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు పలు సూచనలు ప్రతిపాదించినట్లు సమాచారం.
తక్కువ ఖర్చుతో ఎక్కువ సదుపాయాలు : తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వాట్సప్ ద్వారా దర్శనం బుకింగ్ సేవలు ప్రారంభించి క్రమేణా అన్ని దేవాలయాల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచన. శ్రీవారి దర్శనంతో పాటు ఇతర సేవలకు ఉన్న ధరలను సైతం ప్రక్షాళన చేసి తక్కువ ఖర్చుతో వీలైనన్ని ఎక్కువ సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలన్నది చంద్రబాబు ప్రభుత్వ యోచనగా తెలుస్తోంది. దీనికి అనుగుణంగా స్వామివారి దర్శనాలు, సేవలు మొదలు దర్శనానికి వచ్చే భక్తులకు కల్పించే ఇతర సౌకర్యాలు, సదుపాయలకు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధరలను సమీక్షించి వాటిని ప్రక్షాళన చేయనున్నట్లుగా సమాచారం.
భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం: తిరుమల దేవస్థానం లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల పట్ల ఎవ్వరూ అధైర్యపడాల్సిన పనిలేదన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన ఎన్నో విప్లవాత్మక మార్పులను భక్తులు గుర్తించారని, చేసిన మంచి పనులు చెప్పుకోవటంలో కాస్త వెనుక పడినా భక్తులకు చేసిన మేలును గట్టిగానే చాటాలన్నది భావనగా తెలుస్తోంది. తిరుమల ఆలయానికి సరఫరా అయ్యే నెయ్యిలో కల్తీ జరిగిందని ఒక ప్రతిష్ఠాత్మక ల్యాబ్ నిర్ధారించిన తర్వాతే చంద్రబాబు స్పందించారు.
ఇంత పెద్ద అంశంలో మౌనంగా ఉండడం సరికాదన్న భావంతో బాధ్యతగా ప్రజలకు వాస్తవాలు చెప్పారనే విషయాన్నే బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కనుకే సీఎం బయటపెట్టారని, విషయం తెలిశాక కూడా దానిని రహస్యంగా ఉంచి అది మరో రకంగా బయటకు వచ్చి ఉంటే ప్రభుత్వం అప్రతిష్ఠపాలయ్యేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.